ప్రభుత్వాలు చాలా వరకు ఓటు బ్యాంకుతో ముడిపడి ఉన్న సంక్షేమ పథకాలకే అగ్ర ప్రాథాన్యం ఇస్తుంటాయి. ఆ కోటాలో ఓ బ్రహ్మాండమైన పథకం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను ప్రకటించిన కేసీఆర్ తాజాగా ఓ అనూహ్యమైన భారీ పథకానికి శ్రీకారం దిద్దారు. బీసీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించేందుకు సబంధించిన పథకం ఇది. ఈ పథకం కింద బీసీ విద్యార్థులకు 20 లక్ష్ల రూపాయల వంతున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. తొలి ఏడాదిలో ఆ రకంగా 60 కోట్ల రూపాయలతో బీసీ విద్యార్థులను ఎంపికచేసి.. విదేశాల్లో ఉన్నత విద్యకు పంపాలని నిర్ణయించారు. ఈ స్కాలర్ షిప్ పథకానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరును కేసీఆర్ పెట్టడం విశేషం.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద ప్రభుత్వం గరిష్టంగానే ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ బీసీ కుటుంబాల అమ్మాయిలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మి పథకం కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. కులాల వారీగా చిన్న చిన్న కులాలకు కేసీఆర్ వేర్వేరు సందర్భాల్లో ప్రకటించిన వరాలు కూడా అదనంగా ఉన్నాయి.
అయితే ఏకంగా ఏటా కోట్లాది రూపాయల వ్యయానికి సిద్ధ పడుతూ బీసీ విద్యార్థులను విదేశాలలో ఉన్నత విద్యకు స్పాన్సర్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడం అనేది.. చాలా వరకు పేద కుటుంబాల కు ఖచ్చితంగా ఊరట కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఖచ్చితంగా బీసీ కుటుంబాల్లో కొత్త ఆశలకు అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన విధివిధానాలు , మార్గదర్శకాలు ఇంకా పూర్తిగా విడుదల కావాల్సి ఉంది.