రచ్చ ఒక కొలిక్కి వచ్చినట్లే. వ్యవహారం సద్దు మణిగినట్లే. సభా ముఖంగా అయితే బాబాయి , అబ్బాయి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకున్నారు. పైకి మొత్తం వివాదం ఇక సమసిపోయినట్లే భావించాలి. అలా కాకుండా.. కుటుంబవైరం అనేది ఆరని కార్చిచ్చులాగా... నివురుగప్పి లోలోన రగులుకుంటూ ఉంటే మాత్రం ఎన్నికల పర్వం వచ్చేలోగా పార్టీకి చేటు చేసేలా ఏదో ఒక పరిణామం జరగవచ్చు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిహోదాలో ఉన్న బాబాయి శివపాల్ యాదవ్ కు మధ్య ఉన్న వివాదం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కొలిక్కి వచ్చింది. ఈ సభావేదిక మీద బాబాయి- అబ్బాయి లు ఎలా ప్రవర్తిస్తారనేది కూడా పార్టీలో మొన్నటిదాకా చర్చనీయాంశంగానే ఉంది. అయితే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ పూనిక వహించారు. ఆయన అఖిలేష్, శివపాల్ ఇద్దరి చేతులను కలపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అఖిలేష్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి.. బాబాయి కాళ్లను స్పృశించి ఆశీస్సులు అందుకున్నారు.
దానికి తగ్గట్లుగానే , అబ్బాయి అఖిలేష్ కు భరోసా కల్పించేలాగానే బాబాయి శివపాల్ కూడా తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఎప్పుడూ ఆశ లేదంటూ తేల్చి చెప్పారు. ‘తనకు సీఎం కావాలని లేదని, తనను అవమానపరచినా, పదవి నుంచి తొలగించినా ఏం జరిగినా సరే.. పార్టీ కోసమే పనిచేస్తానని, పార్టీకోసం రక్తమైనా ధారపోస్తానని’ ఆయన సెలవివ్వడం విశేషం. ఆయన మాటల్లో ఒకవైపు అఖిలేష్ తీరుమీద అసంతృప్తితో బాటు, తను పదవులకు అడ్డుపడబోయేది లేదని ధైర్యం చెబుతున్నట్లుగా ఉంది. అయితే బాబాయి, అబ్బాయి ఇద్దరూ కూడా ములాయం సింగ్ ను మాత్రం బాగా వెనకేసుకు రావడం విశేషం. నేతాజీని (ములాయం) ను ఎవరు ఏం అన్నా సరే ఊరుకునేది లేదంటూ వారు వ్యాఖ్యానించడం విశేషం.
మొత్తానికి బాబాయి ఇచ్చిన భరోసా ద్వారా అఖిలేష్‌కు ప్రాథమికంగా కొన్ని చికాకులు తొలగినట్లేనని పలువురు అనుకుంటున్నారు.