పాలమూరు గులాబీలో  ముసలం పుడుతోంది!

Update: 2016-10-10 01:20 GMT

అధికార తెరాస పార్టీలో అధినేత మనోభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చాలా మందికి ఉండదు. అయితే తాజాగా పాలమూరు జిల్లాలో ప్రస్తుత మంత్రికి, మాజీ ఎంపీకి మధ్య రాజుకున్న విభేదాలు ఇప్పుడు పార్టీని రచ్చకీడ్చేలా కనిపిస్తున్నాయి. ఒకరి ప్రాధాన్యానికి కత్తెర వేయడానికి మరొకరు ప్రయత్నాలు చేయడం, ఒకరి మీద మరొకరు నిందారోపణలు చేయడం జరుగుతోంది. సాధారణంగా గులాబీ పార్టీలో చాలా తక్కువగా కనిపించే పరిణామం ఇది. అయితే ఈ ఇద్దరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారే కావడం విశేషం.

పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆలంపూర్ ను తాజాగా గద్వాల జిల్లాలో కలుపుతున్నారు. అయితే దీనిని వనపర్తి జిల్లాలో ఉంచాలంటూ సమాంతరంగా ఒక డిమాండ్ వినిపించింది. అంతిమంగా గద్వాల జిల్లాలో ఉంచడమే ఫైనల్ అయింది. అయితే ఈ వ్యవహారం మాత్రం ఇద్దరు ముఖ్య నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ నియోజకవర్గాన్ని గద్వాలలోనే ఉంచాలంటూ తన డిమాండ్‌ను వినిపించిన మాజీ ఎంపీ మందా జగన్నాధం.. తను డిమాండ్ చేసింది ఒకటైతే.. తన గురించి ఒక వర్గం నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఆలంపూర్ ను వనపర్తిలో కలిపేందుకు కలెక్టర్ నిర్ణయించారని తెలిసి, తాను వెళ్లి హైపవర్ కమిటీ వద్ద గద్వాల లోనే ఉంచడం గురించి నివేదించానని.. అయితే ఆ సమయంలో తనతో ఉన్న కొందరు నాయకులు, తాను వనపర్తి లో ఉంచాలని కోరినట్లు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఓ దళితుడికి పేరు రావడం ఇష్టం లేక.. తనకు వ్యతిరేకంగా.. మంత్రి జూపలి కృష్ణారావు స్థానిక నేతల్ని ప్రోత్సహిస్తున్నారంటూ మందా జగన్నాధం ఆపాదించడం గమనార్హం.

తన మీద స్థానిక నేతలు కుట్ర చేస్తున్నారని చెప్పుకోవడం అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీలో.. బయటినుంచి వచ్చిన నేతలతో స్థానిక నేతలకు విభేదాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. తెర వెనుక నుంచి వ్యవహారం నడిపిస్తున్నారంటూ మంత్రి మీద ఆరోపణలు చేయడం, అది కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లకుండా, మీడియా ముందు చెప్పుకోవడం తీవ్రమైన విషయమే అని పలువురు భావిస్తున్నారు.

Similar News