పవన్ కల్యాణ్ : తెలంగాణను వదిలేయడం లేదు!

Update: 2016-11-06 00:52 GMT

జనసేన పార్టీ ప్రజా సమస్యల గురించి యాక్టివ్ గా పోరాటాలు చేయడం ప్రారంభించిన దగ్గరినుంచి ఇప్పటిదాకా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫోకస్ తో మాత్రమే సాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం ఒక్కటే తన పార్టీ ముందున్న ఎజెండా అన్నట్లుగా దాని కోసం మాత్రమే పోరాడుతున్నారు. పైగా తనంతగా ఏలూరులో ఓటరుగా నమోదు కావడానికి రంగం సిద్ధం చేసుకుంటూ.. జనసేనను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీగానే నడపడానికి సిద్ధమవుతున్నట్లు పవన్ కల్యాణ్ సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ పార్టీ తెలంగాణ లో ఉండకపోవచ్చునని చాలా మంది ప్రజలు అనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఓ ట్వస్టు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి బాధ్యులను ప్రకటించారు.

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ముమ్మరంగా ఏపీలో సభలు నిర్వహిసుతన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలుగా సభలు మాత్రమే చెలామణీ అవుతున్నాయే తప్ప.. ఆ పార్టీకి ఇప్పటిదాకా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం అంటూ లేదు. ఏపీలో అలాంటి ఏర్పాటు గురించి పవన్ ఇప్పటిదాకా పట్టించుకోలేదు కూడా! అయితే ఆయన ముందుగా తెలంగాణ మీద ఆ విషయంలో కాస్త దృష్టి పెట్టారు. ఇక్కడ తెలంగాణ పార్టీకి ఇన్‌చార్జిని, రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్తను, మీడియా విభాగాల చీఫ్ ను పన్రకటించారు.

పార్టీ స్థాపించిన నాటినుంచి ఉపాధ్యక్షుడిగా ఉన్న మహేందర్ రెడ్డిని తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్తగా పవన్ ప్రకటించారు. అలాగే నేమూరి శంకర్ గౌడ్ ను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి చేశారు. పి.హరిప్రసాద్ మీడియా వ్యవహారాలు చూస్తారు. పార్టీ పూర్తి కమిటీల నిర్మాణం జరగకపోయినప్పటికీ.. ఈ మాత్రం అయినా.. పార్టీ నిర్మాణం మీద దృష్టపెట్టడం ఇప్పటిదాకా ఏపీలో జరగలేదు. పైగా ఒకసారి కీలక పదవుల భర్తీ పూర్తయిన తర్వాత.. వారి సిఫారసులతో పార్టీ నిర్మాణం మొత్తం క్షేత్రస్థాయి వరకు జరుగుతుంది లెమ్మని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Similar News