తెలంగాణ సర్కారు, తెరాస ప్రభుత్వం మీద న్యాయపోరాటాల ద్వారా ఒత్తిడిపెంచడానికి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరైనవి కాదనే అభిప్రాయం ప్రజలకు కలిగించడానికి తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహం అనుసరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు, రైతు సమస్యలు, ఫీజు రీఇంబర్స్ మెంట్ లో జరుగుతున్న తేడాలు.. ఇత్యాది విషయాల్లో తెలంగాణ కాంగ్రెస్ చాలా దూకుడుగా పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇవన్నీ ప్రజా పోరాటాలు అయితే.. ఎమ్మెల్యేల ఫిరాయింపు- అనర్హత అంశం, మరికొన్ని ఇతర అంశాలపై కోర్టులో కేసులు వేయడం ద్వారా మరో రకమైన పోరాటం సాగిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని ఇప్పటికే వారు సుప్రీం కోర్టు జోక్యం వరకు తీసుకువచ్చారు. ఏదోటి తేలేలా చేస్తున్నారు.
అదే సమయంలో తాజాగా సచివాలయ భవనాల్ని కూలగొట్టి కొత్త భవనాలు కట్టాలనే ప్రభుత్వ నిర్ణయం మీద కూడా హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఈ మిష మీద 1200 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి సర్కారు తెగబడుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. కోర్టుకు వెళ్లి కూల్చివేతలు జరగకుండా స్టే తీసుకువస్తాం అని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఒకవైపు ఈ నెలాఖరుకే సచివాలయం మొత్తం ఖాళీ చేసేసి కార్యాలయాలు వేరే భవనాలకు వెళ్లిపోవాలని అంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి కోర్టు ద్వారా స్టే తెస్తే సచివాలయం పరిస్థితి అటూ ఇటూ కాకుండా తయారవుతుందేమో మరి!!