నేతలారా తస్మాత్ జాగ్రత్త : దులుపుకున్న పోలీసులు!

Update: 2016-10-28 07:59 GMT

పోలీసుల బాధ్యత తీరిపోయింది. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ పర్యవసానంగా మావోయిస్టులు ఎదురుదాడులకు పాల్పడుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టుల ప్రతిస్పందన అనేది ఏ రూపంలో ఉంటుందో అంచనా వేయలేని స్థితిలో అన్ని స్థాయుల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోని నేతలందరూ కూడా.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జరిగిన ఎన్‌కౌంటర్ కు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని, ప్రతిదాడులు ఉంటాయని మావోయిస్టులు హెచ్చరించిన విషయం తెలిసిందే. నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లకు శిక్ష తప్పదని హెచ్చరించారు కూడా! దానికి తగినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే సీఎం, మరియు ఇతర కేబినెట్ మంత్రులు ఇంకా లోకేష్ తదితర కీలక నాయకులకు భద్రత పెంచారు. ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాల్లో అందరు నాయకులకు కూడా భద్రత పెంచారు.

ఇవన్నీ కాకుండా.. నాయకులందరూ కూడా.. తమ కదలికల గురించి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. అవాంఛనీయ పరిణామాలు ఏమీ జరగకముందే.. నాయకులు ఊరు విడిచి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే ముందుగా తమకు తెలియజేస్తూ ఉండాలని వారు కోరుతున్నారు. మావోయిస్టులు తక్షణ ప్రతిదాడులతోనే తమ ఉనికిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమేరకు రాష్ట్రమంతా నాయకులకు భద్రత పెంచిన వాతావరణం కనిపిస్తోంది. సమాచారం ముందుగా తమకు ఇవ్వాలంటూ కేవలం నేతలను హెచ్చరించేయడంతో వదిలేయకుండా, పోలీసులు మరింత జాగరూకతతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Similar News