మాఫియా డాన్ గా చెలరేగుతూ దందాలతో , బెదిరింపులతో వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన నయీంకు సన్నిహితులు ఎవరు. రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలిచిన వారెవరు, అతడిని పెంచి పోషించిన వారెవ్వరు అన్ని రకాల మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. నయీం ఎన్‌కౌంటర్ తరువాత సిట్ ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని వందల మందిని విచారించిన తర్వాత.. బుధవారం మరిన్ని విచారణలు జరిగాయి. ఇదే రోజున నయీం కోడలిని పిలిచి విచారించిన పోలీసులు, బీసీ సంఘాల నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వంతు కూడా వచ్చింది. ఆయనను కూడా సిట్ పోలీసులు పిలిపించి గంటకు పైగా విచారించారు.
వ్యాపార లావాదేవీల, కృష్ణ హత్య వెనుక క్రిష్ణయ్య ప్రమేయం గురించి పోలీసులు ఆరాతీసినట్లు తెలిసింది. నయీం గ్యాంగ్ హత్యలతో గాని, దందాలు, భూకబ్జాలు వేటితోనూ తనకు సంబంధం లేదని, నాకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు తెలిస్తే ఎవరైనా బయటపెట్టవచ్చునని ఆయన చెప్పారు. తనకు 24 గంటలూ బీసీ సంఘాల ఉద్యమాలు వీటితోనే తనకు సరిపోతుందని ఆయన చెప్పుకున్నారు.
అయితే నయీం తనను గురువుగా భావించేవాడని కృష్ణయ్య చెప్పడం విశేషం. ఆయన చెప్పిన వ్యాఖ్యల గురించే సిట్ ప్రధానంగా ఫోకస్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇవాళ ముగ్గురు అధికారులు తనను ప్రశ్నించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంతటితో ముగిసినట్లు కాదని, మరోసారి కృష్ణయ్యను విచారణకు పిలిపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అధికార పార్టీ తెరాస నాయకులతో సహా వేర్వేరు పార్టీలకు చెందిన కీలక నాయకులు కొందరి జాతకాలు ఈ విచారణ పర్వం తర్వాత తారుమారు అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.