మోకాలికీ బోడిగుండుకీ లింకు ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అది వాస్తవం కావచ్చు. ప్రస్తుతం కేంద్రమంత్రి దత్తాత్రేయ చెబుతున్న ప్రకారం చూస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవానికి కాశ్మీర్ సమస్య ఇప్పుడున్నంత స్థాయిలో దేశానికే పెను సమస్యగా రూపుదాల్చి ఉండడానికి కూడా లింకు ఉంటుంది. అప్పట్లో తెలంగాణ విమోచన మాదిరిగానే కాశ్మీర్ విమోచనకు సంబంధించిన అంశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల్లో పెట్టకపోవడం వల్లనే ఆ సమస్య ఇవాళ్టి రూపంలో ఉన్నదనేది భాజపా నాయకుల వాదన. దీనికి ప్రధానంగా అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుపడ్డారనేది వారి ఆరోపణ. ఈ అంశం చుట్టూతా ఇప్పుడు దేశంలో కొత్త వివాదాలపై చర్చలు జరుగుతున్నాయి.
మొన్నటికి మొన్న వల్లభాయ్ పటేల్ జయంతి వచ్చిన నాటినుంచి దేశంలో కొత్త రాజకీయ చారిత్రక వివాదాలకు మోడీ సర్కారు బీజం వేసింది. తెలంగాణ విలీనాన్ని వల్లభాయ్ పటేల్ చేతుల్లో పెట్టినట్లుగా కాశ్మీర్ విలీనాన్ని కూడా అప్పగించి ఉంటే అసలు కాశ్మీర్ సమస్యే ఉండేది కాదనేది భాజపా వాదన. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మేధావులంతా ప్రతిదాడులకు దిగుతున్నారు. భాజపా వ్యూహాత్మకంగా నెహ్రూ కుటుంబం మీద బురద చల్లడానికి కుట్ర చేస్తున్నదని అంటున్నారు.
మొత్తానికి తెలంగాణ విమోచనం జరిగిన తీరుతోను, కాశ్మీర్ విమోచనానికి కూడా ఇండైరక్టుగా సంబంధం ఉందన్న చారిత్రక సత్యం ఇప్పుడు చర్చలోకి వస్తోంది. దీని మీద ఎంత ఎక్కువగా చర్చ జరిగే కొద్దీ అప్పట్లో నెహ్రూ పాత్ర అంతగా బయటకు వస్తుందని అనుకోవాలి. జైపాల్ రెడ్డి లాంటి వాళ్లు నెహ్రూ పాత్రను దేశభక్తిని సమర్థించడానికి ఈ వివాదాన్ని మరింతగా తవ్వితే వారికే ఎక్కువ చేటు జరుగుతుందని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. అప్పట్లో సంస్థానాల విలీన బాధ్యతలను అప్పగించే విషయంలో నెహ్రూ తనదైన వ్యూహాలను అనుసరించారని, అవే ఇవాళ్టి పరిణామాలకు కారణాలని భాజపా ఆరోపణలు గనుక... నిగ్గు తేలితే పార్టీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ మేధావులు తెలుసుకోవాలి.