రాజకీయ నాయకులు తమ విమర్శల్లో భాగంగా అప్పుడప్పుడూ జోస్యం కూడా చెబుతుంటారు. అలాంటిదే ఇది కూడా.. కొన్ని రోజుల కిందట రాష్ట్ర నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా .. తన మార్కు జోస్యం చెబుతూ... రాబోయే 2019 ఎన్నికల్లో కడపజిల్లా పులివెందుల నుంచి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. లోకేష్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, మంత్రుల మీద పెత్తనం సాగిస్తున్నారని, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని వైకాపా చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కౌంటర్లు ఇవ్వడానికి మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఉమా తన జోస్యానికి ఇవాళ్టికి కూడా కట్టుబడి ఉండడం విశేషం.
మొన్నటి తన వ్యాఖ్యతో బాగానే సంచలనం రేగినట్లుగా ఆయనకు ఫీడ్ బ్యాక్ ఉన్నదో ఏమో తెలియదు గానీ.. మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందులనుంచి జగన్ గెలవడం జరగదని అంటున్నారు. లోకేష్ మీద విమర్శలు చేస్తే తెలుగు ప్రజలు వైకాపాను క్షమించబోరని ఆయన హెచ్చరిస్తున్నారు. జగన్ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. అయినా తన జోస్యం తప్పితే ఏం జరుగుతుందో మాత్రం ఆయన వెల్లడించడం లేదు.
అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతాం అని కూడా దేవినేని ఉమా అంటున్నారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నాడంటూ జరుగుతున్న ప్రచారంపై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడిపోతోంది. అయితే ఈ విషయాలన్నీ ఎలా ఉన్నప్పటికీ.. ఉమా చెబుతున్నట్లుగా పోలవరం పనుల్లో వేగం పెంచి, అనుకున్నట్లుగా పదేపదే ప్రకటిస్తున్నట్లుగా పూర్తిచేయకపోతే మాత్రం ప్రజలు క్షమించరు అనేది వారు తెలుసుకోవాలి.