డిజిటల్ దిశగా : మరో వారం రోజుల్లోనే ‘తెలంగాణ వాలెట్’

Update: 2016-12-06 13:58 GMT

దేశంలో అనివార్యంగా ఏర్పడిన నోటు కష్టాలు.. ప్రజలు పడుతున్న ఇబ్బందులకు అందరినీ డిజిటల్ ఆర్థిక లావాదేవీలవైపు మళ్లించడం ఒక్కటే మార్గం అని అందరూ నమ్ముతున్నారు. ప్రజల్లో డిజిటల్ మనీ పట్ల చైతన్యం తీసుకురావడానికి, ఆ లావాదేవీలు పెరిగేలా ప్రోత్సహించడానికి రాష్ట్రప్రభుత్వాలు సహకరించాలని కేంద్రం కోరుతోంది. ఈ దిశగా మోదీ స్వప్నాన్ని సాకారం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని నగదు రహిత లావాదేవీల్లో అగ్రగామి చేస్తాం అని ప్రకటించింది. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విప్లవంగా రూపొందిస్తున్న ‘తెలంగాణ వ్యాలెట్ యాప్’ మరో వారం రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఈనెల 14న హైదరాబాదులో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్సులో తెలంగాణ వ్యాలెట్ యాప్ ను ఆవిష్కరించనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలందరిలోనూ మార్పురావాల్సిన అవసరం ఉందని, సాంకేతిక అక్షరాస్యత అవసరం అని కేసీఆర్ చెప్పారు. డిజిటల్ లావాదేవీల సేవలు అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ముందుకు వచ్చిందని.. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ యుగం ప్రారంభం అవుతుందని కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ వ్యాలెట్ ను ఐటీ శాఖ చాలా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. ఎన్ని ఆధునికమైన ఫీచర్లతో, భద్రత ఏర్పాట్లతో దీనిని రూపొందిస్తే.. అంతగా దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలవవచ్చునన్న ఉద్దేశంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా కొన్ని సూచనలు చేస్తూ యాప్ రూపకల్పనను పర్యవేక్షిస్తున్నారు.

దేశాన్ని డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాలని మోదీ పిలుపు ఇచ్చిన తర్వాత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతీసుకుని ఆయనకు కొన్ని సూచనలు చేశారు. మోదీ పిలుపు మేరకు నేరుగా దిల్లీ వెళ్లి... తన సూచనలు నివేదిక రూపంలో అందించి వచ్చారు. డిజిటల్ భారత్ దిశగా మోదీ ఆలోచనలను కూడా కేసీఆర్ తో పంచుకున్నారు. ఆ వెంటనే డీజీపీ ల సమావేశానికి మోదీ హైదరాబాదు వచ్చినప్పుడు విమానాశ్రయంలోనే కేసీఆర్ ను విడిగా పక్కకు తీసుకువెళ్లి.. తెలంగాణ రాష్ట్రాన్ని తొలి నగదు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలని కోరినట్లుగా కేసీఆర్ తర్వాత వెల్లడించారు. ఆ క్రమంలో భాగంగానే.. అన్ని రకాల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటుగా, పేదలకు కూడా సులువుగా, ప్రోత్సాహకంగా ఉండేలా.. తెలంగాణ వ్యాలెట్ను ప్రారంభించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేవలం అతి తక్కువ వ్యవధిలో ఈ యాప్ ను ఐటీ శాఖ సిద్ధం చేస్తుండడం విశేషం.

Similar News