జిల్లాలపై పోరాటాలు ఇంకానా ఇకపై చెల్లవు!

Update: 2016-10-28 07:07 GMT

తెలంగాణలో పాలకపక్షం మీద ఏదో ఒకరీతిగా బురద చల్లుతూ పోరాటాలను ముందుకు తీసుకువెళ్లడమే తమ డిమాండ్లకు ఆరోపణలకు నిర్దిష్టమైన పునాది ఉండాలనే పట్టుదల విపక్షాలకు అంతగా ఉన్నట్టు లేదు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పర్వం అనేది ఇప్పుడు ముగిసిపోయిన అంశం. తమ పోరాటాలకు కొత్త జిల్లాల ఏర్పాటునే గనుక ఎజెండాగా తీసుకునేట్లయితే.. దానివల్ల ఫలితం పెద్దగా ఉండేదని విశ్లేషకుల మాట.

తాజాగా పాలమూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రేవంత్ ఫోకస్ ప్రధానంగా జిల్లాల విభజన మీదనే సాగిపోవడం విశేషం. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ పాలమూరు జిల్లాను ఆరు ముక్కలు చేశారంటూ రేవంత్ విమర్శించారు. అయితే ఈ విమర్శలు ఆయన పార్టీకి మేలు చేసే అవకాశం ఉందా? అంటే అనుమానమే. ఎందుకంటే.. రేవంత్ చెప్పిన మాటలనే తెరాస తమకు అనుకూల ప్రచారంగా వాడుకునే అవకాశం ఉంది. కేసీఆర్ పాలమూరు జిల్లానుంచి ఎంపీగా గెలిచిన నాయకుడు గనుకనే, ఇక్కడి ప్రజల కష్టాల గురించి అవగాహన ఉన్న నాయకుడు గనుకనే.. అధికార వికేంద్రీకరణతో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆరు జిల్లాలు చేశారనే వాదన వారు వినిపిస్తే ఎవ్వరూ కాదనలేరు. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ప్రజలకు ప్రారంభంలో కాస్తంత గందరగోళం తప్పకుండా ఉంటుంది గానీ.. ఒకసారి అలవాటు పడిపోయాక.. వారు అదే మేలని అనుకుంటారు. కాబట్టి ఇంకా జిల్లాల విభజన అంశాన్ని పట్టుకుని విమర్శలు కురిపిస్తే ఫలం దక్కకపోవచ్చు.

అయితే రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు మరో కష్టం కూడా ఉన్నట్టుంది. తెలుగుదేశం అనేది ఆంధ్రా పార్టీ అంటూ అధికారపక్షం చేస్తున్న విమర్శలనుంచి పార్టీని కాపాడుకోవడం కీలకంగా మారుతున్నట్లుంది. తెలుగుదేశం తెలంగాణలోనే పుట్ట్టిందని దీన్ని ఆంధ్రా పార్టీగా అభివర్ణించడం తగదంటూ ఆయన చెప్పుకుంటున్నారు. అయినా తెలంగాణ పార్టీ కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవడానికి బెజవాడ వెళ్లాల్సి వచ్చినంత కాలం ప్రజలు ఇలాంటి ప్రచారాన్ని నమ్మకపోవచ్చు.

Similar News