జనసేనానిపై కమలనాధుల కన్నెర్ర....

Update: 2017-03-18 12:30 GMT

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే మెజారిటీ దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేయనున్నట్టు పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రకటనకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రైతులు నిరాశకు గురవుతున్నారు. 2014 లో లోక్ సభ ఎన్నికలతోపాటు జరిగిన సార్వత్రిక శాసనసభా ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్ర శేఖర రావు లు రైతులకి రుణ మాఫీ చేస్తామని హామీలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో పోతు పెట్టుకు ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తెలుగు దేశం, నాటి ప్రచార సభలకు ఆంద్ర ప్రదేశ్ కు వచ్చిన నరేంద్ర మోదీ నుంచి తెలుగు రాష్ట్రాల రైతులకి రుణ మాఫీ హామీ ఇప్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. మోదీ అంగీకరించకపోవడంతో టీడీపీ నేతలు విఫలమయ్యారు.

పవన్ పై ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి....

కాగా 2014 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్ర బాబు నాయుడు రైతుల రుణ మాఫీ విషయంలో పూర్తి స్థాయిలో తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రైతులకి ఇచ్చిన రుణ మాఫీ హామీపై స్పందిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రైతుల పై చూపుతున్న పక్షపాత ధోరణిపై, వివక్షతపై నిలదీస్తూ సంచలన ట్వీట్ లు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తీరుకి స్పందించిన భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి, ఉత్తర ప్రదేశ్ రైతులకి పార్లమెంట్ లో రుణ మాఫీ ప్రకటించిన విషయాన్ని నామమాత్రంగా ప్రస్తావించి కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడిపై బురద జల్లే కార్యక్రమంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. "ఉత్తర ప్రదేశ్ రైతులకి రుణ మాఫీ చేస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి కాదు. అవి పూర్తిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిధుల నుంచే జరగనుంది. అయితే ఈ వివరాలేవీ తెలుసుకోకుండా కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన వారు సోషల్ మీడియా వేదికగా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నిత్యం వార్తల్లో నిలవాలనే నోటికి వచ్చింది మాట్లాడుతున్నారే తప్ప ఆయన చేసేది అసలు ప్రజా సమస్యల పోరాటం అని అనిపించుకోదు." అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి.

Similar News