ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు, సామరస్య పోకడలు ఫలితం ఇస్తాయే తప్ప.. బెదిరించే ధోరణులకు దిగితే.. వ్యవహారం చెడుతుంది. కానీ ఇప్పుడు చైనా.. మన దేశం పట్ల తమ ఉత్పత్తులు- విక్రయాల విషయంలో అలాంటి బెదిరింపు పోకడలకే దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయినా ఒక దేశంలోని మార్కెట్ లో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి బెదిరింపు ధోరణి ఏ మేరకు ఫలితం ఇస్తుందో చైనానే స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి.
చైనా ఉత్పత్తులు అనేక రంగాల్లో భారత దేశంలోకి వెల్లువలా వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవ వనరుల అవసరం ఉన్న అనేక పరిశ్రమలు మూతపడి, లక్షల మంది ఉపాధులు కోల్పోతున్నారు. పైగా చైనా ఉత్పత్తులు ఖరీదు తక్కువకే వస్తున్నా వాటి నాణ్యత లేమి, మన్నిక పరంగా, సైడ్ ఎపెక్ట్స్ పరంగా భారతదేశానికి మరో రకమైన చేటు కూడా చేస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో అసలు మన దేశంలో చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలనే డిమాండ్ ఇటీవలి కాలంలో బాగా ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఉధృతంగా ఆ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ ప్రచారాన్ని చూసి చైనాకు కంగారు పుట్టినట్టుగా ఉంది. మన దేశంలో చైనా ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తే గనుక.. అది ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలోను, భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న చైనా కంపెనీలు ముందుకు వచ్చే విషయంలోనూ భారత్ కే నష్టం కలిగిస్తుందని డ్రాగన్ దేశం హెచ్చరిస్తోంది.
అయితే ఇక్కడ చైనా ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. మన దేశంలోని ప్రజల్లో వాస్తవికమైన చైతన్యం వస్తే గనుక.. ప్రత్యేకంగా.. ఇక్కడ అధికారిక నిషేదం అంటూ ఏదీ అక్కర్లేదు. చైనా ఉత్పత్తులమీద నిషేధం అక్కర్లేదు.. వాటి అమ్మకాలు దిగజారిపోయేలా.. ఎవ్వరూ వాటిని కొనకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చైనా ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన డ్రాగన్ దేశమైనా కావొచ్చు గానీ.. మన ప్రజల్లో చైతన్యం వస్తే వారు చేయగలిగేదీ ఏమీ ఉండదని పలువురు అంటున్నారు.