గ్యాప్ రాకూడదు : జగన్‌కు తమ్ముళ్ల సలహా!

Update: 2016-12-06 17:20 GMT

వైఎస్ జగన్మోహనరెడ్డి ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు. పాలకపక్షం పరిపాలన ప్రజాసంక్షేమం దిశగా కాకుండా, గాడితప్పి నడుస్తున్నట్లయితే.. పోరాటాల ద్వారా తిరిగి గాడిలో పెట్టవలసిన బాధ్యత ఉన్న నాయకుడు. వైఎస్ జగన్ అడపాదడపా అలాంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు ను తనదైన శైలిలో తూర్పార పడుతూనే ఉన్నారు. అయితే జగన్ పోరాటాల మీద ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఆయన ఒక ధర్నాచేసి మళ్లీ తన కోటలోకి వెళ్లిపోతారని, కొన్ని నెలల తర్వాత మళ్లీ ఓ దీక్ష అంటూ వస్తారని జనం అనుకుంటూ ఉంటారు.

సరిగ్గా ఇదే లోపాన్ని పార్టీలోని కీలక నాయకులు కూడా జగన్ దృష్టికి తెచ్చినట్లుగా తెలుస్తున్నది. వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో స్వయంగా తిరిగి నిర్వహించే కార్యక్రమాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండకూడదని, బాగా తగ్గించాలని లేకపోతే ప్రజల్లో పలుచన అయిపోతున్నామని జిల్లాల నాయకులు జగన్ వద్ద సలహా చెప్పారుట.

రెండు రోజులుగా జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో మేధోమధన సమావేశాల్లో మునిగి ఉన్న సంగతి తెలిసిందే. జనం ఆదరణను చూరగొనే ప్రయత్నంలో భాగంగా.. తమ పార్టీ ఎన్నో ఆశలతో నిర్వహిస్తున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం ఎలా సాగుతున్నదో సమీక్షించడానికి జగన్ ఈ భేటీలు ఏర్పాటు చేశారు.

అయితే ఈ భేటీల్లో తమ అధినేత తీరులోనూ రావాల్సిన మార్పు గురించి సీనియర్ నాయకులు కొందరు సూచించారుట. తాము మాత్రమే కాకుండా, జగన్ స్వయంగా తరచుగా జనంలో కనిపిస్తూ ఉండాలని వారు అన్నారుట. వారి మాటలను పరిగణనలోకి తీసుకున జగన్ తాను స్వయంగా పాల్గొనే ప్రజాందోళనలను పెంచాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఆయన షెడ్యూలు బిజీగా మారుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

జగన్ వరుసగా జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ఉంది. అలాగే.. ప్రకాశం జిల్లాలో కూడా ఆరోగ్యశ్రీ ధర్నాలో స్వయంగా పాల్గొన బోతున్నారు. ముందుముందు ఇంకా చురుగ్గా జిల్లాల్లో పర్యటనలు కార్యక్రమాలు ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రాగలవని అనుకుంటున్న జగన్.. తన తీరు మార్చుకుని దూకుడు పెంచుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Similar News