గాడ్సే భక్తులకు బ్రేకేయకుంటే మోదీకి మచ్చే!

Update: 2016-10-02 14:29 GMT

ఎవరు ఎన్ని రకాల వివాదాలు లేవదీయడానికి ప్రయత్నించినప్పటికీ.. మహాత్మాగాంధీ.. మన జాతిపిత. అందుకు అర్హమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. అర్హమైన వ్యక్తులు మరింత మంది కూడా ఉండవచ్చు గాక.. అలాగని.. మహాత్ముని త్యాగాలను, ఈ జాతి ఇవాళ్టి స్వరూపానికి ఆయన చేసిన కృషిని మాత్రం విస్మరించలేం. అలాగే.. మహాత్ముడిని అత్యంత పాశవికమైన రీతిలో అంతమొందించిన నాథూరాం గాడ్సే చర్యలను గర్హించకుండా ఉండలేం. అయితే సరిగ్గా గాంధీ జయంతి రోజున మీరట్‌ లో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఇప్పుడు దేశంలోనే కలకలం సృష్ట్ణిస్త్తున్న ఘటన.

అఖిల భారతీయ హిందూ మహాసభగా చెప్పుకుంటున్న సంస్థ ప్రతినిధులు , జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్‌ అశోక్‌ శర్మ ఈ విగ్రహాన్ని మీరట్‌లో ఆవిష్కరించారు. పైగా చాలా వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. గాంధీని అనుసరించకుండా గాడ్సేను పూజించాలన్నది తన ధ్యేయమని, గాంధీ జయంతిని 'ధిక్కార్‌ దివస్‌'గా, వర్దంతిని 'అనన్య దివస్‌' గా జరుపుకుంటాం అని చెప్పారు. నాథూరాం గాడ్సే విగ్రహావిష్కరణ గురించి 2014 నుంచి వివాదాలు రేగుతుండగా.. ఇప్పుడు దాన్ని ఆవిష్కరించారు.

అయితే ఇలాంటి మతోన్మాద శక్తులు, జాతిపితను అవమానించే శక్తులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఎవరు కాదన్నా, ఎలా సమర్థించుకున్నా.. మోదీ సర్కారు మీద హిందూత్వ ముద్ర పుష్కలంగా ఉంది. ఇలాంటి హిందూమహాసభ ముసుగులోని జాతివ్యతిరేక శక్తులకు బ్రేకులు వేయకుంటే గనుక.. మోదీ సర్కారు మీద మతోన్మాద మచ్చ పెరుగుతుంది. వ్రణం ఏర్పడినప్పుడు, తన సొంత కాలినైనా బాధించే చికిత్స తప్పదు. మోదీ ఇలాంటి దుందుడుకు వ్యక్తులు తమకు రాజకీయ అనుకూల శక్తులు అయినా సరే.. వారి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుని.. చక్కదిద్దాలి.

Similar News