కౌంటర్లకు దిగిన తెదేపా : జగన్‌వన్నీ డ్రామాలట!!

Update: 2016-10-25 08:52 GMT

వచ్చే బడ్జెట్ సమావేశాలలోగా కేంద్రం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేకపోతే.. ఆ బడ్జెట్ సమావేశాల తర్వాతి సమావేశాలలోగా.. తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్తాం అని.. హోదా విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతాం అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి విస్పష్టంగా ప్రకటించిన వైనం.. తెలుగుదేశం పార్టీకి మాత్రం డ్రామా లాగా కనిపిస్తోంది. ఈ విషయంలో విమర్శలు వినిపించడానికి ముందుముందు ఎందరు మంత్రులు ప్రెస్ మీట్ లకు స్ర్కిప్టులు సిద్ధం చేసుకుంటున్నారో గానీ.. తొలిగా.. ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. జగన్ రాజీనామా ప్రకటనలన్నీ డ్రామాలు అని ఆయన ఏక పక్షంగా కొట్టి పారేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ డ్రామాలు ఆడుతున్నదని బోండా ఉమా చెప్పారు. జగన్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదని ఆయన అన్నారు.

ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా.. హోదా ద్వారా లభించగల అన్ని రకాల ప్రయోజనాలు వస్తున్నాయని ఉమా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తమ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు.

తెలుగుదేశం పార్టీ హోదా సాధించడం అనే అంశాన్ని పూర్తిగా పక్కన పారేసినట్టే. అయితే అంతో ఇంతో రాజకీయ పోరాటం చేస్తూ రాజీనామాల రూపేణా కేంద్రం మీద ఒత్తిడిపెంచడానికి సిద్ధం అవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నించడం చిత్రంగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News