కోదండరాం పై విద్యార్థి ద్రోహి ముద్ర

Update: 2016-12-11 14:57 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు యుద్ధ వ్యూహాన్ని అనుసరిస్తోంది. అచ్చమైన యుద్ధవ్యూహం. అనగా.. శత్రువును జయించాలంటే.. ముందుగా.. అతని బలాలను లుప్తం చేయడం. నాశనం చేయడం. అధికారంలోకి వచ్చిన తరువాత.. రాజకీయంగా తాము బలోపేతం కావడానికి... అడ్డగోలుగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విస్తరించిన గులాబీ దళాలు.. ఇప్పుడు లొంగని వారి స్థైర్యాన్ని, బలాల్ని దెబ్బకొట్టడం మీద దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేకించి గులాబీ దళాలకు ఒక పట్టాన కొరుకుడపడకుండా.. సర్కారు వ్యతిరేక గళాన్ని వినిపించడంలో తాను నమ్మిన సిద్ధాంత విలువలనుంచి పక్కకు తప్పకుండా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సాబ్ కోదండరాం విషయంలో.. ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు.

ప్రొఫెసర్ కోదండరాం అంటే ఉద్యమ నేతగా విద్యార్థి వర్గాల్లో ఆయనకున్న గుర్తింపు అపారమైనది. అందుకే ఇప్పుడు గులాబీ శ్రేణులు ఆయన ‘బలకేంద్రం’ అయిన విద్యార్థి వర్గం మీదనే దృష్టి పెడుతున్నారు. కోదండరాం అంటేనే విద్యార్థి ద్రోహి అంటూ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు. కోదండరాం తెరాస సర్కారును చికాకు పెట్టడం ప్రారంభించిన తరువాత.. కొన్నాళ్లు గులాబీ దళాలు భరించాయి. తర్వాత.. కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారంటూ బురద చల్లాయి. ఆ తరువాత.. ఆయనను అసలు తెలంగాణ ఉద్యమంలోకి తీసుకువచ్చి నాయకుడు చేసిందే కేసీఆర్ అంటూ.. తమకు రుణపడి ఉండాలనే సంకేతాలను ఇచ్చాయి. ఇవేమీ ఫలితమివ్వలేదు. అందుకని ఇప్పుడు కేసీఆర్ కు బలం ఉన్న విద్యార్థుల వర్గంలో ఆయన కీర్తికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఉద్యమ సమయంలో విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది కోదండరామే అని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఆరోపణలు గుప్పిస్తున్నారు. విద్యార్థులను అణగదొక్కారని ఇతరత్రా ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి.. బాల్క సుమన్, పిడమర్తి రవి లను కోదండరాం మీద ఎక్కుపెట్టిన శాశ్వత అస్త్రాలుగా తెరాస ప్రయోగించినట్లు కనిపిస్తోంది.

Similar News