కేసీఆర్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన నివాస భవనం విషయంలో గానీ, సచివాలయాన్ని కొత్తగా నిర్మించాలని అనుకోవడంలో కూడా గానీ, వాస్తు పరమైన కొన్ని సెంటిమెంట్లు నడిపిస్తున్నాయని కూడా అందరూ అంటూ ఉంటారు. అయితే ఇంతకూ ఆ వాస్తు భయాలు ఏం చెబుతున్నట్లు? ఏ దోషాల నివారణకు, లేదా, ఏం లాభాలను ఆశించి కొత్త నిర్మాణాలకు కేసీఆర్ పూనుకుంటున్నట్టు అంటే.. బహుశా ఇవే కారణాలుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి, కొత్త సచివాలయం కడితే.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందిట. ఇప్పుడున్న నిర్మణాల్లోనే అయితే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదుట!! ఈ విషయాన్ని విపక్షనేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
వాస్తు విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి. కేసీఆర్ కు కూడా అలాంటి నమ్మకాలు పుష్కలంగా ఉండవచ్చు. ఏ నమ్మకాలూ లేకుండా ఆయన కనీసం సెక్రటేరియేట్ కు రాకుండానే రెండున్నరేళ్లుగా పరిపాలన సాగిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం రైతు పోరుబాట పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి చెబుతున్న దాన్నిబట్టి.. అలాగే అర్థం అవుతోంది.
ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాల్లో ఇప్పటికి 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసినా.. ఏ ఒక్కరి కొడుకు కూడా మళ్లీ ముఖ్యమంత్రి కాలేదని పండితులు చెప్పారట. అలాంటి సెంటిమెంటు దోషం వలన తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేకుండా పోతుందేమో అనే ఉద్దేశంతో కేసీఆర్ ఏకంగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించాలని అనుకుంటున్నారట. కేసీఆర్ లో ఉండే సెంటిమెంట్ల గురించి బాగా ఎరిగిన వారికి , ఏమో ఆయనను నూతన సచివాలయ నిర్మాణం దిశగా నడిపిస్తున్నది ఇలాంటి భయాలేనేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి కొత్త సచివాలయం కట్టడమూ మరియు పాత సచివాలయ భవనాలను కూల్చివేయడమూ అనే ప్రక్రియకు కోర్టు చొరవ వల్ల బ్రేకు పడి ఉంది. అది ఎప్పటికి క్లియర్ అవుతుందో చూడాలి.