కొండమీద పూజార్లు కొట్టేసుకుంటున్నారు

Update: 2016-11-04 06:47 GMT

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో ఆలయ అర్చకపురోహితుల్లోని రెండు శాఖల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుడికి కైంకర్యాలు నిర్వహించే విషయంలో ఆయా శాఖాచారాలలో తేడా చేస్తున్నారంటూ ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఏతావతా.. తిరుమల శ్రీవారి మూలవిరాట్టుకు పెట్టే నామం పద్ధతిలో తేడా వల్ల ఈ వివాదం రేగింది. దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చే ఆలోచనలో టీటీడీ యాజమాన్యం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెంగళై వర్గం అంటే వారు ధరించే నామం ఇంగ్లిషు అక్షరం వై ఆకారంలో ఉంటుంది. వడగళై వర్గీయులు అంటే వారు ఇంగ్లిషు అక్షరం యు ఆకారంలోని నామం ధరిస్తారు. స్వామివారికి సాధారణంగా వై ఆకారంలో నామమే ఉంటుంది. అయితే.. తాజాగా యు ఆకారంలో ఉన్న నామం పెట్టారంటూ వడగళై వర్గీయులు ఫిర్యాదు చేశారు.

ఎవ్వరి అనుమతి లేకుండా, స్వామికి ధరింపజేసే నామం పద్ధతిని మార్చేసినందుకు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసులు ఇవ్వాలని టీటీడీ అనుకుంటోంది. రమణ దీక్షితులు ఇటీవలి కాలంలో అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. మామూలుగానే.. తిరుమలకు చాలా పెద్ద స్థాయి వీవీఐపీలు వచ్చినప్పుడు రమణ దీక్షితులు వారు బస చేసిన కాటేజీలకే వెళ్లి అక్కడే వారికోసం కొన్ని ప్రత్యేక పూజలు చేయడం, వారిని ప్రత్యేకంగా ఆశీర్వచనం చేయడం వంటివి చేస్తుంటారనే వివాదాలు గతంలో రేగాయి. కొన్ని రోజుల కిందట ఆయన తన మనవడిని నైవేద్యం సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్టుగా ఒక ఆరోపణ వచ్చింది. తాజాగా స్వామివారి నామం ఆకృతిని మార్చినందుకు మళ్లీ నోటీసులు అందుకోబోతున్నారు.

తిరుమలలో సాధారణంగా వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా పూజాదికాలు, నిత్యానుష్టానాలు ఉంటాయి.

Similar News