ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో కివీస్ వైట్ వాష్ కు సిద్ధ పడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. మూడో రోజు భారత బౌలర్ల ధాటికి , ప్రధానంగా అశ్విన్ మణికట్టు మాయాజాలానికి ఎదురొడ్డి నిలవలేకపోవడం వారి దుస్థితికి అద్దం పడుతోంది. అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. ఆ రకంగా ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం అతనికి 20వ సారి. అలాగే తన స్పిన్ మాయాజాలానికి ఆరువికెట్లు పడగొడితే.. అశ్విన్ రనౌట్ల రూపేణా పడగొట్టిన రెండు వికెట్లు కూడా కలుపుకుంటే.. మొత్తం 8 వికెట్లు అతని ఖాతాలోకే చేరాయి.
కివీస్ తొలి ఇన్నింగ్స్ దయనీయంగా తయారైపోయింది. ఓపెనర్లు గుప్తిల్ , లాథమ్, మిడిలార్డర్ లో నీషమ్ మినహా మరెవ్వరూ భారత్ బౌలర్ల ధాటికి నిలవలేకపోవడం విశేషం. ఈ ముగ్గురి పతనాన్ని అశ్వినే శాసించడం మరో విశేషం. మొత్తానికి అశ్విన్ ఆరు వికెట్లు , రెండు రనౌట్లు చేయగా, జడేజా మిగిలిన రెండు వికెట్ల పని పట్టాడు. 90.2 ఓవర్లలో 299 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. అక్కడికే భారత్ కు 258 పరుగుల ఆధిక్యం లభించింది.
న్యూజీలాండ్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ.. కెప్టెన్ విరాట్ కొహ్లి సెకండిన్నింగ్స్ బ్యాటింగ్ నే ఎంచుకున్నాడు. తద్వారా మరింత బెంబేలెత్తించే భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచడానికి వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తోంది. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో ఓవర్ కూడా ముగియకుండానే గంభీర్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. భారత్ కేవలం 6 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. మురళీ విజయ్ 11, పుజారా 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. నాలుగోరోజు ఆటలో భారత్ చెలరేగి బ్యాటింగ్ చేసి.. ప్రత్యర్థి బెంబేలెత్తేంత స్కోరు చేస్తే విజయం తథ్యంగా మనకే దక్కే అవకాశం ఉంటుందని భావించవచ్చు.