కాళ్ల బేరానికి వస్తున్న బీసీసీఐ

Update: 2016-11-01 16:05 GMT

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రీడా బోర్డు ఇదే. రూపాయి ఖర్చయ్యే చోట పదిరూపాయలు ఖర్చు పెడితే కానీ ఆగేవారు కాదు. అలాంటి బీసీసీఐ నాయకులు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సంస్థ నిధులను ఖర్చు పెట్టే అధికారం లేకుండా పోవడంతో వారికి చేతులు కట్టేసినట్లుగా ఉంటోంది. దీనిని తాళలేక బీసీసీఐ తరఫున అసలు వారికి ఈ దుస్థితి సంప్రాప్తించడానికి కారణమైన లోథా కమిటీకే లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ అనే సంస్థను తమ సొంత జాగీరులాగా , సొంత వ్యవస్థ లాగా నడపడాన్ని కొందరు బాగా అలవాటు చేశారు. అది తమ ప్రత్యేక రాజ్యం అన్నట్లుగా ప్రభుత్వాల జోక్యాన్ని కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకునేవారు. ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐ సంస్కరణల గురించి లోథా కమిటీ నివేదిక ఇచ్చింది. లోథా కమిటీ నివేదికను అమలు చేసి తీరాల్సిందేనంటూ సుప్రీం కోర్టు వారికి చీవాట్లు పెట్టింది. అయినా వారిలో మార్పు రాలేదు.

ఓ కమిటీ మీటింగ్ పెట్టుకుని.. లోథా కమిటీ నివేదికను అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సుప్రీం ఆదేశాలతో వారి బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. బీసీసీఐ కు అసలు కష్టాలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ టూర్ మొదలు కానుంది. రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడే వారికి కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి నేపథ్యంలో తాము నిధులు వాడుకోవడానికి ఏదైనా మార్గం చూపాలంటూ వారు తిరిగి లోథా కమిటీనే లేఖ రూపంలో ఆశ్రయించారు.

అయితే తమ నివేదికను బుట్టదాఖలు చేసిన వారి విజ్ఞప్తికి వారెలా స్పందిస్తారో చూడాలి.

Similar News