‘‘కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటారు. తల్లి సోనియాగాంధీ నిర్వర్తిస్తున్న బాధ్యతలను ఆయన అందుకుని, పార్టీని ముందుకు నడిపిస్తారు. త్వరలోనే ఆయన అధ్యక్షుడు అయ్యే ముహూర్తం ఉంది’’ ఈ డైలాగు ఇప్పటికి కొన్ని వందల సార్లు జాతీయ రాజకీయ యవనికపై వినపడి ఉంటుంది. రాహుల్ గాంధీ భజన చేయదలచుకున్న కాంగ్రెస్ గూటిలోని ప్రతి చిలక ఇదే పలుకులు వల్లిస్తూ ఉంటుంది.
మన తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉండే వారిలో డిగ్గీరాజాగానీ, జైరాం రమేష్ వంటి వారు గానీ.. ఎన్ని సార్లు ఈ డైలాగు వల్లించారో లెక్కే లేదు. వచ్చే నెలలోనే రాహుల్ కు పట్టాభిషేకం.. రాబోయే ప్లీనరీలోనే రాహుల్ కు పట్టాభిషేకం వంటి వార్తలు కూడా మీడియా లో ఎన్ని సార్లు కనిపించి ఉంటాయో లెక్క లేదు. తాజాగా మరో సీనియర్ నాయకురాలు అంబికాసోని కూడా అదే పాట పాడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను త్వరలోనే అప్పజెప్పనున్నట్లు ఆమె ప్రకటించారు.
అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్రాల ఉప ఎన్నికల ప్రచార పర్వంలో బిజీగా నిమగ్నం అయి ఉన్నారు. ఆ ఎన్పికల పర్వం పూర్తి కాగానే, ఆయన ఇక నేరుగా రంగంలోకి వచ్చేస్తారని, అధ్యక్ష బాధ్యతలు పగ్గాలు పట్టేసుకుంటారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పుడు యువరాజు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో పార్టీ ఫలితాల్లో సర్వభ్రష్టత్వం చెందితే ఏమవుతుంది? అప్పుడు యువరాజు ఓడగొట్టిన ప్రజల అలిగి అజ్ఞాతంలోకి విదేశాలకు వెళితే ఎలా, లేదా, అది ఆయన లెగ్ మహిమే అని భావించి.. పార్టీ సారథ్యం అప్పగించడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందా లాంటి సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.