ఏపీఈడీబీ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ

Update: 2016-12-10 16:27 GMT

ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు) అధికారిక వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి సింగల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఆవిర్భవించిన ఏపీఈడీబీకి సంబంధించిన సేవలు ఇక నుంచి ఈ వెబ్ పోర్టల్ ద్వారా పొందవచ్చు.

ఈ వెబ్‌సైట్ (www.apedb.gov.in) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు మార్గం ఏర్పరుస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సౌలభ్యంగా వుంటుంది. ఏపీలో ఉన్న అవకాశాలను విశదీకరిస్తూనే, ప్రభుత్వ విధానాలపై మరింత సులభంగా అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల అనుమతుల ప్రక్రియ ఇంకా వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలలో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఈ పోర్టల్ ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. అలాగే, వివిధ రంగాలలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, భాగస్వామ్యం తరహాలో పెట్టుబడులకు ఉత్సుకత కనబరిచే వారందరికీ ఈ వెబ్‌సైట్ ద్వారా సమగ్రమైన సమాచారం లభిస్తుందని తెలిపారు. అకుంఠిత దీక్షతో రాష్ట్రంలో పెట్టుబడులను సాధించే దిశగా సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో ఈ వెబ్‌సైట్ ఆవిష్కరణ ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

పెట్టుబడిదారులకు, భాగస్వాములకు, ప్రభుత్వానికి ఈ వెబ్‌సైట్ పటిష్టమైన సమాచారాన్ని అందిస్తుందని ఏపీఈడీబీ కార్యనిర్వాహక అధికారి జె. కృష్ణకిషోర్ అన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడికి ఉన్న అసంఖ్యాక అవకాశాలపైన ఈ వెబ్‌సైట్ సమగ్రమైన సమాచారాన్ని అందజేస్తుందని అన్నారు.

Similar News