పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బాగా విస్తరించాలని భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ లేని వాక్యూమ్ ను పూడ్చి, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎదగాలని భాజపా తపన పడుతోంది... ముందు తమ పార్టీ బలం, ప్రజల్లో ఆదరణ పెంచుకుంటే.. తర్వాత సీట్లు కూడా పెంచుకోవచ్చుననే వ్యూహంతో వెళుతోంది. ఆ క్రమంలో భాగంగానే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి చూస్తున్నారు. అమరావతి పరిధిలోని మంగళగిరిలో సువిశాలమైన స్థలంలో.. పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
మొన్నమొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ 2019లో అధికారంలోకి రాబోయేది తాము అని ప్రకటనలు గుప్పిస్తూ దూకుడుతో వ్యవహరించినప్పటికీ.. తర్వాత.. ఆ ధోరణి తగ్గించింది. ఇప్పుడు మిత్రధర్మం పాటిస్తూ.. తెలుగుదేశానికి ఇబ్బంది లేని ప్రకటనలు మాత్రమే చేస్తోంది. అయితే రాష్ట్రంలో పార్టీని ఇదివరకటికంటె ఉన్నత స్థాయికి విస్తరించాలనే ఆలోచన మాత్రం ఉంది. ఈ అవకాశం మిస్సయితే పార్టీని బలోపేతం చేసుకోవడానికి మళ్లీ అవకాశం ఎప్పటికో గాని రాదని వారు అనుకుంటున్నారు. తెలుగుదేశంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే.. పార్టీ విస్తరణకు చేయగలిగినదెల్లా చేయాలనేది వారి ప్రణాళికగా ఉంది.
జిల్లాల్లో కూడా భాజపాకు కేడర్ పెరుగుతూనే ఉన్నారు. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు జనాదరణను రాబట్టుకోవడం చాలా సులువైన సంగతి. అయితే పార్టీకి దక్కే ఆదరణను ఓట్ల రూపంలోకి మార్చుకునే కళను వారు ఎంతమేరకు వంటబట్టించుకోగలరో వచ్చే ఎన్నికల సమయానికి గాని తెలియదు.