మల్కన్ గిరి ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టలు గురువారం అయిదు రాష్ట్రాల్లో బంద్ కు పిలుపు ఇచ్చారు. ప్రజలందరూ సహకరించాల్సిందిగా మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో ఏవోబీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజన్సీ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మావోయిస్టుల పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో బంద్ జరుగుతుంది.
బంద్ సందర్భంగా పోలీసులు దాన్ని విఫలం చేయడానికి విస్తృత ఏర్పాట్లలో ఉన్నారు. సరిహద్దు గ్రామాలను అంతటా గాలిస్తున్నారు. దాదాపుగా ఈ అన్ని రాష్ట్రాల్లోనూ ఏజన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లెడపడుతున్నారు.
మరోవైపు ఆర్కే కు సంబంధించిన సమాచారం అనేది మిస్టరీగా మారుతోంది. ఆయన పోలీసుల వద్దనే ఉన్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద ఉంటే దాచుకోవాల్సిన అవసరం లేదని పోలీసులు అంటున్నారు. అదే సమయంలో మావోయిస్టులు మాత్రం.. ఇప్పటిదాకా ఆయనకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పోలీసు నిఘా ఏమైంది?
నవంబరు 3వ తేదీన బంద్ నిర్వహిస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే మావోలు ప్రకటించారు. ఈ బంద్ కు ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ మావోయిస్టుల పేరుతో అనేక గ్రామాల్లో పోస్టర్లు వెలిశాయి. మరి ఇన్నిరోజులుగా పోలీసు నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? గ్రామాల్లో పోస్టర్లు ఎవరు అతికించినట్టు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి మరి!