ఎన్నికల కమిషన్ కొరడా విదిల్చింది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు.. అడ్డగోలుగా తమ పార్టీలకు కీర్తి ప్రతిష్టలు దక్కేలా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుని అందుకు ప్రభుత్వ సొమ్మును ఎడాపెడా ఖర్చు పెట్టడం.. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
పార్టీ ప్రచారాలను లక్ష్యించే ప్రచారాలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టడం కరెక్టు కాదని, ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వ సొమ్మును వాడడానికి వీల్లేదని, ప్రభుత్వ స్థలాల్లో పార్టీ సమావేశాలు పెట్టుకోవడం కూడా కుదరదు అని ఎన్నికల సంఘం ఆదేశించంది.
నిజానికి ఈ ఆదేశాలు ప్రజలకు చాలా మెరుగైనవిగా అనిపించవచ్చు. కానీ పార్టీలకు చాలా చిక్కులు తప్పవని అనిపిస్తోంది. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలన్నా, వైకాపా మరో ధర్నా నిర్వహించాలన్నా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైదానాలను వాడుకుంటూ ఉంటారు. ఇకపై ఆలాంటి ఆటలు కుదరకపోవచ్చు.
పైగా చంద్రబాబునాయుడు మాత్రమే కాదు.. ప్రభుత్వంలో ఉండే పార్టీలన్నీ తమ పార్టీకి కూడా ప్రచారం దక్కేలాగానే.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంటారు.
చంద్రన్న కానుకనే తీసుకుంటే.. పసుపు రంగు సంచులు.. ఇవన్నీ ఏమిటి?
తెలుగుదేశం పార్టీకి ప్రచారం కాదని ఎన్నికల సంఘం చెప్పగలదా? మరి, పసుపు రంగు సంచులు ఇవ్వడం కరెక్టు కాదని ఆదేశించగలదా? మొత్తానికి ఎన్నికల సంఘం పార్టీల కు ఈ ఆదేశాల ద్వారా ఒక రకంగా కళ్లెం వేసినట్లే అనిపిస్తోంది.