ఇండియన్ ఓట్లకు గండికొట్టడానికి.. ట్రంప్ కోటరీ కుట్రలివే..

Update: 2016-11-04 04:48 GMT

అమెరికాలో అధ్యక్ష ఎన్నికకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. తమ తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి ఎవరి పాట్లు వారు పడుతున్నారు. కేవలం తాము ఓట్లు సంపాదించుకోవడం మాత్రమేకాదు, ప్రత్యర్థి కి వచ్చే ఓట్లకు గండికొట్టడం మీద కూడా ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్ల శాతం కూడా గణనీయంగానే ఉన్న నేపథ్యంలో ట్రంప్ కోటరీలోని హిందూ సంఘం రిపబ్లికన్ హిందూ కొలిజన్ వారు ఒక యాడ్ ను రూపొందించారు. అమెరికాలో ప్రసారం అయ్యే భారతీయ ఛానెల్స్ లో ఈ యాడ్ వేయిస్తున్నారు. ఈ యాడ్ లో ప్రధానంగా హిల్లరీ క్లింటన్ ను భారత వ్యతిరేక, మోదీ మరియు హిందూ వ్యతిరేక, పాకిస్తాన్ అంటే ప్రేమ ఉన్న నాయకురాలిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుండడం విశేషం.

వారు ప్రకటనల్లో పేర్కొంటున్న విషయాలు ఇలా ఉంటున్నాయి. హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్ సానుభూతి పరురాలని, భారత్ పై పోరాడేందుకు గతంలో వారికి ఆయుధాలు అందించారని అంటున్నారు. హిల్లరీ గెలిస్తే కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇచ్చేయాలని ఆమె భర్త క్లింటన్ అనుకుంటూ ఉన్నట్లుగా ఆ యాడ్ లో వివరిస్తున్నారు. అలాగే మోదీ కి గతంలో అమెరికా వీసా రాకుండా అడ్డుకోవడంలో కూడా ముఖ్యభూమిక హిల్లరీదేనని ఆరోపిస్తున్నారు.

 

అయితే అమెరికన్ భారతీయుల్లో ట్రప్ సంపాదించుకున్న క్రెడిబిలిటీ తక్కువ మోతాదులో ఉండబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే ఈ ప్రకటన చూసిన భారతీయులెవరైనా.. హిల్లరీ పట్ల చులకన అభిప్రాయం ఏర్పరచుకుంటారనడంలో సందేహంలేదు. భారతీయులను ఆకట్టుకోవడానికి పాకిస్తాన్ వ్యతిరేకతను ప్రచారం చేయడం ఒక్కటే ఇక్కడ ప్రచారాంశంగా కనిపిస్తోంది. అయినా హిల్లరీ గెలిచినంత మాత్రాన కాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసి పాకిస్తాన్ కు ఇచ్చేయడానికి మధ్యలో క్లింటన్ ఎవరు? అని అమెరికాలోని ఓ భారతీయుడు వ్యాఖ్యానించడం విశేషం.

Similar News