ఆళ్ళ మాటల్లో వైసీపీ వాదన క్లియర్!

Update: 2016-10-26 09:19 GMT

9/12. ఈ సంఖ్య 9/11 లాగా ఎదో ఉగ్రవాద దాడులకు సంబంధించినది కాదు. విచారణకు పిలువబడిన వైసీపీ ఎమ్మెల్యే లలో హాజరైన వారి సంఖ్య. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మందిని హక్కుల కమిటీ ఎదుట విచారణకు పిలిస్తే.. కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు వ్యక్తిగత కారణాల నెపం చూపించారు.

కాకపోతే, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తాజాగా విచారణకు హాజరైన తరువాత మీడియా తో మాట్లాడిన మాటలను గమనిస్తే ఆ పార్టీ వైఖరి ఏమిటో అర్థం అయిపోతుంది. తెలుగు పోస్ట్ ముందుగ అంచనా వేసినట్లు గానే, తమ మీద వేటు వేసే వరకు పరిస్థితులను లాగితే, దానివల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుందని పార్టీ బలంగా నమ్ముతున్నట్లుంది. ఆళ్ళ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రాణాలు అర్పించడానికి అయిన సిద్ధంగా ఉన్నాం అని, అయితే రాష్ట్రానికి ప్రత్యెక హోదా మాత్రం సాధించి తీరుతం అని సెలవిచ్చారు.

వంద సార్లు మైక్ లాగుతే, వంద సార్లు బల్ల ఎక్కి నిలబడతా, ప్రత్యెక హోదాను సాధించే వరకు సభను స్తంభింప చేస్తాం అని వారు అంటున్న తీరు గమనిస్తే.. తమ మీద సస్పెన్షన్ వేటు పడాలని వారు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే హక్కుల కమిటీ ఎలాంటి సిఫారసులు ఇస్తుందో, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Similar News