విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థిరపడడానికి కేంద్రం ఏం సాయం అందించింది.. అంటే అయోమయానికి గురికాకుండా ఒక్కమాటైనా చెప్పడం చాలా కష్టం. కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి అయినా సిస్టమ్ ప్రకారం రావాల్సిన వాటిని మాత్రమే ఇస్తూ.. అక్కడికేదో.. ఏపీకోసం తాము బ్రహ్మాండాన్ని బద్దలు చేసేస్తున్నట్లుగా బిల్డప్ లు ఇవ్వడం.. అక్కడికేదో ఆంధ్రప్రదేశ్ సాంతం మోదీకి రుణపడి ఉండాలన్నట్లుగా చెప్పుకోవడంలో భాజపా నాయకులకు రాటుదేలిపోయారు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే ప్రజల సెంటిమెంటును మోదీ హామీలపై ప్రత్యేకంగా పెట్టుకున్న నమ్మకాన్ని సమర్థంగా కాలరాసేయడంలోనూ, ప్యాకేజీ పేరుతో ఓ చీకటి ప్రకటన చేసి.. ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేయడంలోనూ ఇత్యాది అనేక వ్యవహారాల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఎక్కువ అన్నది విశ్లేషకులు చెప్పేమాట. దానికి తగ్గట్టుగానే అరుణ్ జైట్లీ కూడా ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి మొర్రో అని మొరపెట్టుకుంటూ ఉన్నా కూడా.. కనీసం ఆలకించినట్లయినా తలాడించకుండా.. నిర్లిప్తంగా నిర్లక్ష్యం వహిస్తూ గడిపేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మరో కీలకమైన డిమాండ్.. ఇప్పుడు మళ్లీ ఆయన కోర్టుకే వెళుతోంది. ఒకసారి ఆయన వేలు పెట్టాల్సి వస్తే.. ఇక మన ఆశలు గల్లంతే అని నాయకులు కొందరు అప్పుడే నిస్పృహతో అంటున్నారు.
ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు తెలుగుదేశం ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు వారికి ప్రధానంగా రెండే అంశాలు నిర్దేశించి పంపారు. 1) ప్యాకేజీకి చట్టబద్ధత, విభజన చట్టం అంశాల అమలు 2) విశాఖకు రైల్వేజోన్.
అయితే విశాఖ రైల్వేజోన్ అంశాన్ని తెలుగుదేశం ఎంపీలు , కేంద్రమంత్రులు కలిసి బుధవారం నాడు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వద్దకెళ్లి విన్నవించుకున్నారు. అయితే అది అంత సులువుగా తేలే వ్యవహారం కాదంటూ ఆయన పుల్లవిరుపుగా చెప్పేయడం గమనార్హం. అది అధికారుల్తో చర్చించి నిర్ణయించేది కాదని, ప్రధానితోను, ఆర్థికమంత్రితోను మాట్లాడి రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని సురేశ్ ప్రభు తెగేసి చెప్పారు.
ఒకసారి ఆర్థిక మంత్రి వేలుపెట్టవలసి వస్తే గనుక.. ఇక ఆ కోరిక నెరవేరడం కల్లే అని నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత ప్రకటించడానికే మీనమేషాలు లెక్కించే ఆర్థికమంత్రి ఇక దీన్ని ఒప్పుకోవడం కల్ల అనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో ప్యాకేజీ ప్రకటించిన రోజున.. విజయవాడ కేంద్రంగా జోన్ ఇచ్చే అవకాశం ఉన్నదనే ఊహాగానాలు వినిపించాయి. అలా జరిగితే రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి లేకుండా ప్రాంతాలవారీ అసమానతలు చాలా దారుణంగా పెరిగిపోతాయని చాలా మంది దానిని వ్యతిరేకించారు. విశాఖ రైల్వేజోన్ అనే ప్రజల కల విషయంలో కేంద్రం మాత్రం చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.