ఆ రెండూ గట్టిగా పట్టుకున్నారు

Update: 2016-10-28 08:08 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే.. 2019 ఎన్నికల నాటికి ప్రజల్లో గౌరవ ప్రదమైన స్థానం, ఆ దామాషాలో సీట్లు సంపాదించుకోవాలని, పరువు కాపాడుకోవాలని తహతహతో ఉంది. అందుకోసం ఆ పార్టీ నాయకులు నిరంతరం ఏదో ఒక రీతిలో పోరాడుతూనే ఉన్నారు. ప్రజాపోరాటాలు కొందరివైతే ప్రకటనల పోరాటాలు కొందరివి. న్యాయపోరాటాలు మరికొందరివి. ఏది ఏమైనప్పటికీ.. కేసీఆర్ సర్కారును తమ పోరాటాల ద్వారా ఉక్కిరి బిక్కిరి చేయాలని మాత్రం అనుకుంటున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కారును బాగా ఇరుకున పెట్టడానికి ప్రధానంగా రెండు అంశాలను మాత్రం తీవ్రంగా పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అవే.. రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్. ఈ రెండు అంశాలకు అదనంగా హైదరాబాదు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మీద కూడా అంతో ఇంతో ఫోకస్ పెడుతున్నారు.

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో కాంగ్రెస్ ను గద్దెమీదికి తీసుకువస్తానని , పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా పార్టీ కసరత్తు మాత్రం బీభత్సంగా చేస్తూనే ఉంది. నాయకుల సంఖ్య పరంగా తెలంగాణలో కాంగ్రెస్ , తెలుగుదేశానికంటె కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. ఆ ప్రభావం.. వారి పోరాటాల్లో కూడా కనిపిస్తోంది. తెలుగుదేశ పోరాటాలు అడపాదడపా ధ్వనిస్తూ ఉంటే.. కాంగ్రెస్ నిత్యపోరాటాలతో దూసుకెళ్తోంది.

అయితే సర్కారును ఇబ్బందిపెట్టడానికి కాంగ్రెస్ ప్రధానంగా రైతు రుణమాఫీ, పీజు రీఇంబర్స్ మెంట్ పథకాలనే తీసుకోవడం వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు. ఈ రెండూ ఆర్థిక వనరులు పుష్కలంగా అవసరమైన విషయాలు కాగా, రెండూ కూడా నేరుగా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేవి. ఈ రెండు అంశాల మీద కాంగ్రెస్ బహుముఖ పోరాటం సాగిస్తోంది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై విద్యార్థులతో సంతకాల సేకరణను కూడా చేపట్టింది. అలాగే హైదరాబాదు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి కూడా తీవ్రంగా ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ తొమ్మిది ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్నారని, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మాత్రం డబ్బు లేవని అంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పోరాటాల విషయంలో గేరప్ అయి.. ఉధృతంగా సాగుతున్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది.

 

Similar News