తమిళనాట అమ్మ అభిమానులకు శుభవార్త. జయలలిత పూర్తిగా కోలుకున్నారు అని అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఆమెకు చేయాల్సిన అన్ని కీలక చికిత్సలు పూర్తయ్యాయని, ఆమె పూర్తిగా కోలుకున్నారు అని అపోలో ఆస్పత్రి ఎండి ప్రతాప్ సీ రెడ్డి మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలను గమనించేలాగా, గుర్తించేలాగా, తనకు ఏం కావాలో అడిగి తీసుకునే దశ వరకు ఆమె కోలుకున్నారని, ఆస్పత్రినుంచి ఇంటికి ఎప్పుడు వెళ్లాలి? ఎప్పుడు మీడియా ముందుకు తానే వచ్చి.. మాట్లాడాలి అనే సంగతులను జయలలిత స్వయంగా నిర్ణయించుకుంటారు అని ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. అపోలో యాజమాన్యం ప్రకటనతో అమ్మ అభిమానుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతాయనడంలో సందేహం లేదు.
అనారోగ్యం కారణంగా పురట్చితలైవి జయలలిత సెప్టెంబరు 22 నుంచి అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. బ్రిటన్, సింగపూర్, ఎయిమ్స్ తదితర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు వచ్చి ఆమె పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. ఒక దశలో జయలలిత ఆరోగ్యం గురించి రకరకాల పుకార్లు చెలరేగినా కూడా.. అభిమానులు చెక్కు చెదరలేదు. పూజలు, హోమాలు నిర్వహిస్తూ అమ్మ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటూ వచ్చారు. మరోవైపు ప్రభుత్వ పరిపాలన పరంగా ప్రతిష్టంభన ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం జరిగాయి. కేబినెట్ నిర్వహించే అధికారిక పన్నీర్ సెల్వం చేతిలో పెట్టారు.
ఇప్పుడు జయలలిత పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి తన కార్యక్రమాలు తానే నిర్వహించే పరిస్థితికి వచ్చిన తరువాత.. అంతా మారుతాయని అనుకుంటున్నారు. అయితే జయలలిత పూర్తిగా కోలుకుని అపోలో నుంచి డిశ్చార్జి అయిన తరువాత.. మళ్లీ ఒకసారి ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు తీసుకువెళ్తారా, ఆ అవసరం ఉండదా? అనే విషయం మాత్రం స్పష్టత రాలేదు.