అనంతలో.. హోదా కోసం నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

Update: 2016-11-10 11:39 GMT

పవన్ కల్యాణ్ ప్రత్యేకహోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభ గురువారం మధ్యాహ్నం జరిగింది. పవన్ కల్యాణ్ సుమారు గంటపాటు ఈ సభలో అనర్గళంగా మాట్లాడారు. హోదా కోసం జనసేన అలుపెరగని పోరాటం చేస్తుందని ప్రత్యేక రైలులో ప్రతినిధులను ఢిల్లీ తీసుకువెళ్లి.. కేంద్రంలోని పెద్దలకు ప్రత్యేకహోదా వాంఛను తెలియజెబుతామని పవన్ అన్నారు. ప్యాకేజీ మనకు రావాల్సింది ఇచ్చారే తప్ప ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని సెలవిచ్చారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా అడిగానని, రాగానే.. ఆయనకు కూడా హోదా గురించి నివేదిస్తానని చెప్పారు. రాజకీయ అవినీతిని రూపుమాపే దిశగానే జనసేన ప్రతి అడుగు ఉంటుందని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా సరే.. 2019 ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

 

పవన్ కల్యాణ్ మాటల్లోనే ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే...

2014 ఎన్నికల సందర్భంగా అనంతపురానికి వచ్చా.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల తరఫున ఓట్లు అడగడానికి వచ్చా. సమస్యలు వచ్చినప్పుడు మీ తరఫున నిలబడి అడుగుతానని చెప్పా. సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే తప్ప పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంతటి సమస్య అయినా కావొచ్చు. పోరాటం చేస్తాం నిలబడతాం... మడమ వెనక్కి తిప్పేది ఉండదు. అనంతపురం అంటే నాకు ఇష్టం. ఇది బాగా వెనుకబడిన జిల్లా. మీరు చూపించే ప్రేమ అంటే నాకు ఇష్టం.

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం సరైన విషయం కాదు అనే ఉద్దేశంతో.. కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు మళ్లీ హోదాకోసం పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం.

ప్రత్యేకహోదా గురించి చెప్పాల్సి వస్తే చాలా సంగతులున్నాయి. మనవద్దకు ఓట్లు అడగడానికి వచ్చేప్పుడు చాలా సులువైన భాషలో హామీలు ఇస్తారు. తీరా ఆ హామీలు తీర్చాల్సి వచ్చే సమయానికి మనకు అర్థం కాని భాషలో నిబంధనల గురించి ప్రస్తావిస్తారు. అందుకే కేంద్రం రూపొందించిన విభజన చట్టం, ప్రత్యేక హోదా గురించిన హామీల గురించి నిపుణులతో కలిసి అధ్యయనం చేసిన తర్వాతే ఇవాళ మీ ముందుకు వస్తున్నాను.

ఈ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అని నేను అన్నాను. అవమాన పరచడం కాదు గానీ.. ఈ ప్యాకేజీలో వారు కొత్తగా ఇచ్చిందేమీ లేదన్నది నా ఉద్దేశం. కేంద్రమంత్రి వెంకయ్య, తదితర పెద్దలు ఈ ప్యాకేజీ చాలా మంచిది అని పలుమార్లు సెలవిచ్చారు.

ఇవ్వని స్పెషల్ స్టేటస్ తో హీరోలు అయిపోయిన వాళ్లూ ఉన్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజీతో సన్మానాలు చేయించుకున్న వాళ్లూ ఉన్నారు. ఏదైనా అడిగితే.. హోదా అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. మీకు హోదా ముగిసిన అధ్యాయం కావొచ్చు... కానీ.. కరవు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లా లాంటి వాళ్లకు అదే ఒక అమృతపు చుక్క. దయచేసి అంత తేలిగ్గా అంత మాట్లాడకండి. ఇది ముగిసిన అధ్యాయం అని మీరు అనవచ్చు గానీ.. దీని నుంచి సరికొత్త అధ్యాయాన్ని జనసేన తరఫున మొదలు పెడతాం అని హెచ్చరిస్తున్నా.

అహో ఆంధ్రభోజా అని పొగిడించికుంటూ సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్రం విషయానికి వస్తే.. నరేంద్రమోదీ గారి మీద నాకు గౌరవం ఉంది గానీ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతందని అనిపిస్తే ఎదురు వెళ్లి అడగడానికి నేనేమీ సంకోచించను. రాజకీయ చతురత ప్రదర్శించి.. పేర్లు మార్చి ఏదో స్పెషల్ ప్యాకేజీగా ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారే తప్ప.. నిజానికి వారు ప్రత్యేకంగా ఇస్తున్నది ఏమీ లేదు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాగితాల మీద అంకెల గారడీ ప్రదర్శిస్తున్నారు తప్ప.. మరొకటేమీ కనిపించడం లేదు. హోదా గురించి మాట్లాడితే.. సుజనా చౌదరి గారు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉదాహరణతో ఏదేదో వివరణ ఇచ్చుకున్నారు. ఈ స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదనే సంగతి సుజనా చౌదరికి తెలియదా?

 

వచ్చే ఏడాది అనంతపురంలో జనసేన పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభిస్తా. అనంతపురం జిల్లా కరవును పారద్రోలడానికి ఎన్ని రకాలుగా ఈ దుర్భిక్షనివారణకు ప్రయత్నాలు చేయవచ్చో.. నిపుణులతో మాట్లాడి అన్ని రకాలుగానూ పోరాడడానికి నేను ప్రయత్నం చేస్తా? ఇక్కడ తాగునీళ్లు కావాలంటే ఒక సాయిబాబా రావాలా...? ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్లు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలా? అసలు ఇక్కడ నీటి వసతి లేకుండా పరిశ్రమలు మాత్రం ఎలా వస్తాయి? అందుకే ఈ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నా.

2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీచేస్తా. గెలుస్తానో ఓడిపోతానో తెలియదు. ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఎన్నికల్లో మాత్రం పోటీచేస్తాను.

స్పెషల్ ప్యాకేజీ అంటూ కేంద్రం చాలా దారుణంగా మోసం చేసింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతున్నా.. మనకు రావాల్సిన దాని మీదే.. ఒక ముసుగు కప్పి మనకు ఇస్తే.. దాన్ని మీరు సంతోషంగా ఎలా ఆమోదించగలిగారు. చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని నేను కోరుతున్నా? నాకు రాజకీయంగా ఎవ్వరి మీద ద్వేషం లేదు. చంద్రబాబునాయుడు అయినా, జగన్మోహనరెడ్డి అయినా అందరూ నాకు కావాల్సిన వాళ్లే. విధానాల పరంగా వారి పార్టీల విధానాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతానే తప్ప.. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లను. భాషా సంస్కారం లేని విమర్శలతో కుహనా రాజకీయాలకు జనసేన సిద్ధపడదు.

అనంతపురంలోని సామాజిక వేదిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక రైలు తీసుకుని, వీలైతే మీ అందరినీ కూడా వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీలో మన ప్రత్యేకహోదా డిమాండ్ గురించి అక్కడి కేంద్రప్రభుత్వంలోని పెద్దలకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. రైతు సమస్యల గురించి వాస్తవంగా పోరాడే యోగేంద్ర యాదవ్ లాంటి పెద్దలను కూడా కలిసి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వారికి తెలియజెబుతాం.

అనంతపురం జిల్లా, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు ఉన్న ఇబ్బందులను తీర్చకపోతే గనుక.. మళ్లీ తెలంగాణ లాంటి మరో వేర్పాటు వాద ఉద్యమాలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో రాజకీయ అవినీతి ఎక్కువైందనే ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి పెరిగిందని అంతా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా.

..

నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ రాజకీయాల్లోని దోపిడీ, డబ్బుతో కూడిన రాజకీయాల మీద అసహ్యం , విసుగు కలుగుతోంది. సినిమాలు నాకు ఇష్టమైన రంగమేమీ కాదు. నిజజీవితంలో గెలవకపోవచ్చు గానీ.. దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద నిరంతర పోరాటం చేయడానికే జనసేన పార్టీ ముందుకు వస్తోందని చెబుతున్నా. జనసేన పార్టీ నిర్మాణాన్ని అనంతపురం నుంచే ప్రారంభిస్తాం. ఇక్కడ ఇంతమంద యువత ఉన్నారు. వీరికి ఎలాంటి విద్య ఉండాలి, ఎలాంటి నైపుణ్యాలు కావాలి అనే విషయాలపై జనసేన పాలసీ మేకర్స్ ద్వారా కసరత్తు చేస్తూ ఉన్నాం. ఎన్నికల గురించి, పవర్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లో మార్పుకోసమే జనసేన మీ ముందుకు వచ్చింది. ఇవన్నీ చాలా కష్టతరమైన పోరాటాలు. కానీ మీ అందరి మద్దతు ఉంటే మనం ఈ పోరాటం సాగించవచ్చునని కోరుకుంటున్నా.

ప్రత్యేకహోదా విషయంలో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి, ఇచ్చిన మాట తప్పారనేసంగతి గుర్తు చేయడానికి, మీరు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ మా రాష్ట్ర అవసరాలకు సరిపోయేది కాదని వారి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్ కూడా అడిగాను. ఇంకా అపాయింట్‌మెంట్ రాలేదు. రాగానే.. ఆ విషయాలు అన్నిటినీ ప్రధానికి వివరిస్తాను.

రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయకుండా, వ్యవస్థలోని ఇతర రూపాల్లోని అవినీతికి అడ్డుకట్ట వేయడం అనేది అసాధ్యం. దానికోసమే జనసేన ప్రయత్నిస్తుంది. దానికి మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నాను.

==‌

Similar News