అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. వీరు తమ సొమ్ముకోసం భయపడుతూ, ప్రత్యక్ష ఆందోళనలు ధర్నాలకు దిగుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు విపక్షాలు కూడా అండగా నిలుస్తున్నాయి. అయినా పరిస్థితి మాత్రం అప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆస్తుల విక్రయం పూర్తిచేసి డిపాజిటర్లకు చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వారిలో అంతగా ఆందోళన పెచ్చుమీరుతుండడమే చిత్రంగా ఉంది.
బెజవాడ నుంచి వెలగపూడిలోని సచివాలయం వరకు నిర్వహించదలచుకున్న మహాపాదయాత్ర అనేది ఉద్రిక్తంగా మారింది. అగ్రిగోల్డ్ బాధితుల్లోని ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ బాధితులకు కేవలం విపక్షాలు మాత్రమే కాకుండా, పలు సామాజిక సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. పోరాట వేదిక సారథి చలసాని శ్రీనివాస్ ను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కూడా స్టేషన్లోనే నిర్బంధించారు. ఆయన కూడా స్టేషన్లో ఉంటూనే.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిందేనంటూ అక్కడే ఆందోళనను కొనసాగించారు.
అగ్ర్రిగోల్డ్ బాధితులకు ఒక రకంగా ఇటు చెంపదెబ్బ, అటు గోడదెబ్బ అన్నట్లుగా పరిస్థితి తయారైపోయింది. సంస్థ ముంచేయడం వలన నష్టపోయిన డిపాజిటర్లు ఒకవైపు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఈ విషయంలో అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని.. వాటిని విక్రయించి డిపాజిటర్లకు తక్షణం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది కూడా. అయితే ఈలోగా డిపాజిటర్లలో ఆందోళన మాత్రం పెరుగుతూనే ఉంది. వారు ప్రత్యక్ష ఆందోళనలకు దిగిన సమయంలో పోలీసులు వారి పట్లనే అమానుషంగా ప్రవర్తించడం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు డిపాజిటర్లను మోసంచేసిన వారు క్షేమంగానే ఉంటే, తమ సొమ్ము తమకు చెల్లించమని అడుగుతున్నందుకు పోలీసు లాఠీ దెబ్బలను రుచి చూడాల్సి వస్తోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు తీర్పు మేరకు ఆస్తులను విక్రయించి.. డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం ఎంత వేగిరం స్పందించి పనులు పూర్తిచేస్తే తప్ప డిపాజిటర్లలో ఆందోళన తొలగిపోదని పలువురు అంటున్నారు.