అంతా మీరే చేశారు!

‘అంతా మీరే చేశారు..’ అంటాడు బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్దార్ధ, తన తండ్రి ప్రకాష్‌రాజ్‌తో. ఇప్పుడు అవే మాటల్ని అనడానికి సిద్ధంగా ఉన్నారు వైకాపా నాయకులంతా. గెలుపోటములను సొంతం చేసుకోడానికి వాళ్లెవరూ సిద్ధంగా లేరు. 2019 తర్వాత జరిగిన దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో నాయకుల్లో ఓ రకమైన ధీమా వచ్చేసింది. ‘అధిష్ఠానం చెబుతుంది, మేము పాటిస్తాం’ అనే ధోరణిలో వాళ్లంతా ఉన్నారు. అది జగన్‌ మీద నమ్మకమో, పాలనలో, పార్టీ నిర్ణయాల్లో తమ ప్రమేయం లేదనే నిర్లిప్తతో ఎవరికీ అర్థం కావడం లేదు.

Update: 2023-11-14 02:01 GMT

జగన్‌ పాలనలో సీనియర్ నేతలూ కీలుబొమ్మలే!

వైకాపా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి 

‘అంతా మీరే చేశారు..’ అంటాడు బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్దార్ధ, తన తండ్రి ప్రకాష్‌రాజ్‌తో. ఇప్పుడు అవే మాటల్ని అనడానికి సిద్ధంగా ఉన్నారు వైకాపా నాయకులంతా. గెలుపోటములను సొంతం చేసుకోడానికి వాళ్లెవరూ సిద్ధంగా లేరు. 2019 తర్వాత జరిగిన దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో నాయకుల్లో ఓ రకమైన ధీమా వచ్చేసింది. ‘అధిష్ఠానం చెబుతుంది, మేము పాటిస్తాం’ అనే ధోరణిలో వాళ్లంతా ఉన్నారు. అది జగన్‌ మీద నమ్మకమో, పాలనలో, పార్టీ నిర్ణయాల్లో తమ ప్రమేయం లేదనే నిర్లిప్తతో ఎవరికీ అర్థం కావడం లేదు.

151 సీట్ల దక్కించుకుని, అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ తనడైన  శైలిలో  పాలన మొదలుపెట్టారు. మ్యానిఫెస్టో అమలే లక్ష్యమని ప్రకటించి, ఆ దిశగా అడుగులు వేశారు. తన హామీలకు తగ్గట్లుగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను నెలకొల్పారు. సంక్షేమ పథకాల అమలులో దళారులకు చోటు లేకుండా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల అరాచకంతో విసిగిపోయిన లబ్ధిదారులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది.

వాలంటీర్లు గడప గడపకూ వచ్చి సంక్షేమ వారధులుగా మారడంతో ప్రజా ప్రతినిధులకు చాలావరకూ పని లేకుండా పోయింది. ‘ఒకప్పుడు పథకాలు కావాలంటూ జనం మా చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నారు’ అంటూ ఓసారి సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం జగన్‌ మార్కు పాలనకు నిదర్శనం. ఇంతవరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైకాపా విజయకేతానికి ఈ ‘డోర్‌ స్టెప్‌’ పాలనే కారణం. ఇదంతా నాణేనికి ఒకవైపు.

వాలంటీర్లు, సచివాలయాలతో జనానికి ప్రభుత్వం చేరువ అవుతుండటంతో... ప్రజా ప్రతినిధులంతా నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కూడా వారి ప్రమేయం ఉండటం లేదు. ఏ స్థాయి నాయకుడైనా హైకమాండ్‌ నుంచి ఆదేశాలు వస్తేనే మీడియాతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అజెండా కూడా పై నుంచే వస్తుంది. ప్రతిపక్షం మీద విరుచుకుపడటానికి తప్ప, మంత్రులకు సైతం ఎలాంటి ఇతరత్రా ఎలాంటి హక్కులూ లేవు. కీలక విధాన నిర్ణయాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడతారు. బహుశా ఆయన కూడా జగన్‌ పర్మిషన్‌ తీసుకునే నోరు తెరుస్తారేమో!

గడప గడపకూ వైకాపా అని ఎమ్మెల్యేలు తిరుగుతున్నా, సాధికార యాత్ర అని బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు బస్సు యాత్రలు చేస్తున్నా.. అధిష్టానం ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. తాము కేవలం నిమిత్త మాత్రులమేనని... పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా తమకు ఎలాంటి సంబంధం లేదని వారంతా భావిస్తున్నారు. 2019 వరకూ జగన్‌ కోసం కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టుల రూపంలో పనులు దొరుకుతాయని అనుకున్న వారికి జగన్‌ ‘సంక్షేమ’ పాలన నిరాశ మిగిల్చింది. 2014 నుంచి తెలుగుదేశం పాలనలో ఆ నేతలు బాగుపడ్డ విధానం చూసి, చాలామంది వైకాపా నాయకులు వైకాపాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ఐదేళ్లలో వాళ్లు బావుకున్నదేం లేదు. బాగుపడ్డదీ లేదు.

రాబోయే ఎన్నికల్లో వైకాపా జెండా మోయడానికి చాలామంది కార్యకర్తలు సిద్ధంగా లేరని ఓ సీనియర్‌ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఖర్చు పెట్టడం, అధికారంలో ఉన్నప్పుడు వడ్డీతో సహా వసూలు చేసుకోవడం.. ఇదీ రాజకీయ వ్యాపారానికి మూల సూత్రం. జగన్‌ మార్క్‌ పాలన ఆ విధానానికి గండి కొట్టింది. వైకాపాతో ‘వ్యాపారం’ లాభసాటి కాదని ఆ పార్టీ నేతలకు తెలిసివచ్చింది.

ఈ సారి ఎన్నికలపై  వైకాపా క్యాడర్ కి  ఆశలు కానీ, టెన్షన్‌ కానీ లేవు. తాము గెలిచినా, ఓడినా చేయగలిగేదేమీ లేదని వాళ్లకు తెలుసు. గెలిస్తే పేరుకు ముందు ఓ పదవి ఉంటుంది, లేకపోతే ‘మాజీ’గా తిరగవచ్చు. ఎన్నికల తర్వాత ‘అంతా మీరే చేశారు’ అని క్రెడిటంతా జగన్‌ ఖాతాలో వేసేయొచ్చు... అది గెలుపైనా.. ఓటమైనా!

Tags:    

Similar News