మృత దేహానికి మేకప్‌!

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తొమ్మిదేళ్లు నిండినా, ఆ గాయం ఇంకా ఏపీ వాసుల గుండె మీద పచ్చిగానే ఉంది. ఐదుకోట్ల ఆంధ్రుల ఆర్తనాదాలను ఏ మాత్రం లెక్క చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌పై కన్నెర్ర చేయని ఆంధ్రుడు లేడు.

Update: 2023-08-21 03:56 GMT

సీడబ్ల్యూసీలో ఏపీకి ప్రాధాన్యం

అయినా కాంగ్రెస్‌ బతికి బట్టకట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తొమ్మిదేళ్లు నిండినా, ఆ గాయం ఇంకా ఏపీ వాసుల గుండె మీద పచ్చిగానే ఉంది. ఐదుకోట్ల ఆంధ్రుల ఆర్తనాదాలను ఏ మాత్రం లెక్క చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌పై కన్నెర్ర చేయని ఆంధ్రుడు లేడు. ఆ ఫలితంగా 2014, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా హస్తం పార్టీ చెంపలు ఛెళ్లుమనిపించారు ఏపీ వాసులు. తెలంగాణ ఏర్పాటు కంటే, ఆ ప్రక్రియ జరిగిన తీరుపైనే జనానికి ఒళ్లు మండిపోయింది. అంత హడావుడిగా ఏర్పాటు చేసిన తెలంగాణలో కూడా ఆ పార్టీ బావుకున్నదేం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయి, కేంద్రంలో దారుణంగా ఓడిపోయి, సగం రాష్ట్రాల్లో పవర్‌కి దూరమై చివరకు వందేళ్ల పార్టీ సర్వ భ్రష్టుత్వం పట్టిపోయింది.

ఇక్కడ అధికారంలోకి వస్తామన్న ఆశ కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏ మాత్రం లేదు. అయితే తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ లాంటి వాళ్లు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి తామే వస్తామని, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు. 175 స్థానాల్లో నిలబడటానికి అభ్యర్థులే లేని ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్న చింతా మోహన్‌ కాన్ఫిడెన్స్‌కి ముచ్చటేస్తుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకున్నా అధికారంలోకి వచ్చినంత సంబరాలను ఆ పార్టీ చేసుకోవచ్చు.

కాంగ్రెస్‌ దుస్థితికి అస్తవ్యస్త రాష్ట్ర విభజన ఓ కారణం కాగా, ఆ పార్టీ స్థానాన్ని వైకాపా భర్తీ చేయడం మరో కారణం. జనసేన కూడా అంతో ఇంతో బలం పుంజుకుంటోంది. ఐదేళ్ల తర్వాతైనా ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని చాటుకోవాలనుకుంటోంది బీజేపీ. తెలుగుదేశం ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షమే. ఎలాంటి రాజకీయ శూన్యతా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఏపీలో కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అయినా తన ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రుద్రరాజు నలుదిశలా పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తూ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో (సీడబ్ల్యూసీ) శాశ్వత సభ్యత్వం కల్పించారు. సీడబ్ల్యూసీ ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ. అలాగే రాష్ట్రానికే చెందిన టి.సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజుకు శాశ్వత ఆహ్వానితులుగా, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం కల్పించారు. ఇలా సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు మరణావస్థలో ఉన్న పార్టీకి ఇస్తున్న ఆక్సిజన్‌ లాంటిది ఇది. ఈ చర్యలతో కాంగ్రెస్‌ బతికి బట్టకడుతుందని ఏపీలో ఉన్న ఎవరికీ నమ్మకం లేదు, చింతా మోహన్‌ లాంటి వాళ్లకు తప్ప.

Tags:    

Similar News