TDP : టీడీపీ లో నకిలీలు హల్ చల్.. తెలుగు తమ్ముళ్లది అరణ్య రోదనే
నేతలు చంద్రబాబు, లోకేశ్ లను మోసం చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు
నేతలు చంద్రబాబు, లోకేశ్ లను మోసం చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జిల్లా కమిటీల్లో కొత్త వారికి అవకాశం కల్పించి, పాత వారిని పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నియమించిన జిల్లా కమిటీల్లో ఎక్కువ మంది సభ్యుల ఎంపిక స్థానిక శాసనసభ్యులు మాత్రమే చేశారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లను చివరకు ఫైనల్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ లకు ఆ యా నియోజకవర్గాల్లో తమ పార్టీతో సుదీర్ఘమైన సంబంధం ఉన్న వారెవరో తెలియదు. ఒకస్థాయి నేతలు మాత్రమే చంద్రబాబు, లోకేశ్ లకు తెలుస్తుంది. దిగువస్థాయి నేతలు ఎవరూ పెద్దగా తెలిసే అవకాశముండదు.
ఎమ్మెల్యేల జాబితానే...
ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఆసరాగా తీసుకుని పార్టీతో సంబంధం లేదని వారిని కూడా ఎంపిక చేసినట్లు టీడీపీ సోషల్ మీడియాలోనే పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రతీ జిల్లా పార్టీ కమిటీల్లో 98 శాతం మంది సభ్యులు పార్టీ కోసం పని చెయ్యని సభ్యత్వం ఉన్న నకిలీ తమ్ముళ్ళతో నింపేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తికోసం తప్ప పార్టీ కోసం పనిచేయ్యని, అసలా తనకు పదవి ఉందొ లేదో ననికూడా తెలియని, నకిలీ, అమాయక,సత్తాలేని సోదరులతో నింపేశారంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కేసులు బనాయించుకుని, జెండాను వదలకుండా పట్టుకున్న వారికి సరైన గుర్తింపు నియోజకవర్గాల్లోనూ, జిల్లాల్లోనూ దక్కడం లేదన్న విమర్శలున్నాయి.
సోషల్ మీడియా వేదికగా...
రాజకీయ జ్ఞానమే లేని అమాయకులకు పదవులు ఇచ్చి అసలైన సత్తా ఉన్న టీడీపీ సైనికులను దూరంగా ఉంచేశారంటున్నారు. వారి ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా చేస్తున్నారు.నంద్యాల, కర్నూలుపార్లమెంటు నియోజకవర్గంలో ఇటువంటివ వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందన్నది సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ ను మోసం చేసి జాబితాను తయారు చేసి పంపడంతో వారి పేర్లకు వీళ్లు టిక్ పెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నార. నిప్పుతో టీడీపీని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం నారా లోకేశ్ కు ఉందంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా నకిలీ తమ్ముళ్లను ఏరిపారేయాలని అసలు సోదరులు కోరుతున్నారు.