YSRCP : జగన్ చెప్పినా నేతలు వినడం లేదా.. అదే కారణమా?
వైసీపీలో కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్న జగన్ నిర్ణయం మాత్రం అమలు కావడం లేదు.
వైసీపీలో కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్న జగన్ నిర్ణయం మాత్రం అమలు కావడం లేదు. జగన్ పదే పదే చెబుతున్నప్పటికీ నియోజకవర్గ స్థాయి నేతలు పట్టించుకోవడం లేదు. వివిధ కేసుల్లో ఇరుక్కున్న కార్యకర్తలకు ఏ రకమైన సాయం కూడా అందించడం లేదన్న అభిప్రాయం క్యాడర్ లో బలంగా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో జగన్ పుట్టిన రోజు సందర్భంగా కూడా అనేక మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అయినా వారిని పట్టించుకున్న వారు లేరు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి లీగల్ సాయం పొందాలంటే గ్రామస్థాయిలో క్యాడర్ కు కష్టసాధ్యమవుతుంది. నియోజకవర్గ నేతలు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో క్యాడర్ ఇబ్బందులు పడుతుంది.
కేసులు నమోదవుతున్నా...
వైసీపీ అధినేత జగన్ మాత్రం గతంలో అధికారంలో ఉన్నప్పటి మాదిరిగా కాకుండా ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పదవుల సంగతి మాట దేముడెరుగు.. అసలు కేసులతో క్యాడర్ ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ గా ఉండి కార్యకర్తలు అండగా ఉంటున్నప్పటికీ ఎక్కువ నియోజకవర్గాల్లో మాత్రం క్యాడర్ ను అసలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినా తమను పట్టించుకోకపోవడం ఏంటని కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు ఎక్కువగా క్యాడర్ కు అందుబాటులో లేరన్న పోస్టులు కనిపిస్తున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే...?
జగన్ మాత్రం తరచూ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్ లకు వెళ్లడం, ఆ ఖర్చు తాము భరించాల్సి రావడంతో ఈ గొడవ మనకు ఎందుకులేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మరొకవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు ఉన్నారో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితులు వైసీపీలో ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు నిచ్చినప్పటికీ పెద్దగా కార్యకర్తలు రాకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేతగా జగన్ మేలుకోకుంటే రానున్న కాలంలో క్యాడర్ అనే పదం ఫ్యాన్ పార్టీలో కనిపించకుండా పోతుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తుంది.