Telangana : విద్యార్థినులకు ఉచిత స్కూటీలు.. అర్హతలేంటో తెలుసా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళ దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2023 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఈ ఏడాది అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎంతమదికి ఈవీ స్కూటీలు ఇవ్వనున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ఈవీ స్కూటీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి ఇవ్వాలన్న దానిపై ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమచారం.
ఎవరికి ఇవ్వాలన్నది....
కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ స్కూటీలను విద్యార్థినులకు అందిస్తే తాము ఇచ్చిన హామీని అమలు చేయడమే కాకుండా కాలుష్యం నుంచి కూడా తెలంగాణను కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈవీ స్కూటీలు లక్ష రూపాయలు వరకూ మార్కెట్ లో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎంత మందిని లబ్దిదారులుగా ఎంపిక చేస్తుందన్నది చూడాలి. అయితే అధికారుల ప్రాధమికంగా చెబుతున్న లెక్కల మేరకు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులకు ఇవ్వాలా? లేక ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారికి ఇవ్వాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదంటున్నారు. ఫస్ట్ ఇయర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇస్తే ఎక్కువ కాలం ఆ స్కూటీని వారు వినియోగిస్తారని ప్రభుత్వం కూడా అభిప్రాయపడుతుంది. దీని వల్ల దశలవారీగా అందరికీ ఇవ్వడం సాధ్యమవుతుందని భావిస్తుంది.
అర్హతలివే...
అదే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులకు ఇస్తే ఒకే ఏడాదితో స్కూటీ వల్ల ఉపయోగం లేకుండా పోతుందన్న భావన కూడా వ్యక్తమవుతుంది. మరొకవైపు తెలుపు రంగు కార్డు ఉండి, ఆర్థికంగా వెనక బడి ఉన్న విద్యార్థినులకు మాత్రమే స్కూటీలను ఇచ్చే అవకాశముంది. వీరు స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత కళాశాల నుంచి అనుమతి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుందని, అలాగే తమ కుటుంబానికి చెందిన తెలుపు రంగు కార్డు, ఆధార్ కార్డులను కూడా జత చేయాల్సి ఉంటుందని, మరొకవైపు తాజాగా ఫేస్ రికగ్నిషన్ కూడా తీసుకుని స్కూటీని పంపిణీ చేసే అవకాశముందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారవుతాయని అధికారులు తెలిపారు.