T20 World Cup Finals :ఒట్టేసి చెబుతున్నా... భారత్ విశ్వ విజేత కావడానికి వీళ్లు కారణం కాక మరెవరు?

టీ20లో ప్రపంచంలో మేటి జట్టు ఏదయ్యా అంటే.. నో డౌట్ ..టీం ఇండియానే.

Update: 2026-03-09 02:15 GMT

టీ20లో ప్రపంచంలో మేటి జట్టు ఏదయ్యా అంటే.. నో డౌట్ ..టీం ఇండియానే. ఇందులో ఏమాత్రం శషబిషలకు తావులేదు. ఎందుకంటే.. వరసగా రెండు సార్లు ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడిన జట్టును ఖచ్చితంగా ప్రపంచంలో మేటి జట్టుగా అనుకోవాల్సిందే. ప్లేయర్లు మారి ఉండవచ్చు. కానీ రెండేళ్ల కఠోర శ్రమ, నిరంతర సాధన.. లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నట్లుగా ప్రతి రోజూ పడే తపన టీం ఇండియాకు కాకుండా మరే జట్టుకు ఉంటుంది. అందుకే మరోసారి టీ20 వరల్డ్ కప్ భారత్ సొంతమయింది. ఈగెలుపులోనూ మళ్లీ ముగ్గురున్నారు. బ్యాటింగ్ లో సంజూ శాంసన్, బౌలింగ్ లో బుమ్రా, అక్షర్ పటేల్ లు రాణించడంతోనే గెలుపు సులువుగా మారింది. ఫైనల్ పోరు తేలిపోయింది.

విక్టరీ సంజూ...
సంజూ శాంసన్ : సంజూ శాంసన్ వరసగా మూడు మ్యాచ్ ల నుంచి ఫామ్ లోకి వచ్చాడు. 97, 89, 89 పరుగులు వరసగా మూడు మ్యాచ్ లలో చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్ కల నెరవేరింది. ఎన్నో ఏళ్ల కల.. సీనియర్ల నుంచి నేర్చుకున్న మెలుకువలు తనను ఇప్పుడు క్రీజులో నిలబెట్టాయని సంజూ హుందాగా చెప్పుకున్నాడు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆటలో పడిన శ్రమ, తపన తనను కూడా ఆ వైపు చూపిందన్నాడు. ఒకరకంగా సంజూ శాంసన్ లేకుంటే సెమీ ఫైనల్స్ లోకి, ఆ తర్వాత ఫైనల్స్ లోకి అనంతరం ఛాంపియన్ గా గెలిచే వారమే కాదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఓపెనర్ గా వచ్చి తను ఆడిన తీరు యావత్ భారతాన్ని ఆకట్టుకుంది.
భారత్ కు వరమే...
జస్ప్రిత్ బుమ్రా : టీం ఇండియా సీనియర్ ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా భారత్ టీంలో ఉండటం ఒక వరం. ఏ స్పెల్ వేసినా అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ పరుగులు రాబట్టడంలో దిట్ట. బుమ్రా మైదానంలో ఉన్నాడంటే టీం ఇండియాకు భరోసా.. అలాగే ప్రత్యర్థులకు దడ. సెమీ ఫైనల్స్ లోనూ, ఫైనల్స్ లోనూ బుమ్రా రాణించిన తీరుతోనే ఈరోజు కప్పు కల మరోసారి సాకారమయింది. బంతులు అతి వేగంగానూ.. అంతే సూటిగానూ వేయడంలో బుమ్రాను మించిన వారు మరొకరు ఉన్నారా? లేరు. ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా ఇది ఒప్పుకుంటాడు. ఫైనల్స్ లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా నాలుగు వికెట్లు తీసి కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చాడంటే.. ఈ గెలుపులో బుమ్రా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అక్షర్ అలెన్ ను పంపించి...
అక్షర్ పటేల్ : ఎడమ చేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ విన్యాసాన్ని ఎంత చెప్పినా తక్కువే. కేవలం బౌలింగ్ చేయడంలోనే కాదు. ఫీల్డింగ్ లో అక్షర్ కు ఉన్న కమిట్ మెంట్ ను చూసి భావితరం నేర్చుకోవాలి. సెమీ ఫైనల్స్ లో అద్భుతమైన క్యాచ్ లు పట్టి భారత్ ను ఫైనల్స్ కు చేర్చిన అక్షర్ పటేల్ ఫైనల్స్ లోనూ అత్యంత విలువైన మూడు వికెట్లు తీశాడు. అందులో దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్ లో చితక బాదిని అలెన్ ను అక్షర్ పటేల్ త్వరగా ఇంటికి పంపినప్పుడే భారత్ విజయం దాదాపు సగం ఖాయమయింది. అలాగే అక్షర్ ప్రమాదకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంటే ఈ ముగ్గురే కాదు... టీం ఇండియా ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణించారు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది శివమ్ దూబె గురించి. చివర ఓవర్లలో వచ్చి 26 పరుగులు చేసి భారత్ కు భారీ పరుగులు తెచ్చిపెట్టాడు. అందుకే అందరి కృషితో పాటు ఈ ముగ్గురు టీం ఇండియా ప్రపంచ విజేతగా మారడానికి కారణమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News