Ganta Srinivasa Rao : గంటా..ఎంట్రీ ఈసారి బలంగా ఉంటుందట...సిగ్నల్స్ వచ్చేశాయట
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జరిగితే సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కే అవకాశాలున్నాయని తెలిసింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జరిగితే సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ మేరకు అధినాయకత్వం సంకేతాలు ఇచ్చారు. ఇటీవల విశాఖలో అన్ని సంస్థలకు ఇచ్చే భూములు గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే భీమిలి నియోజకవర్గంలో ఉండటం, ఆయన సహకారం కూడా పుష్కలంగా లభించడంతో ఆయనకు ఈసారి విస్తరణలో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు అధినాయకత్వం నుంచి హామీ లభించినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అయితే గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి కల్పిస్తే, అదే జిల్లాలో ఉన్న వంగలపూడి అనితను కేబినెట్ నుంచి తప్పించాల్సి ఉంటుంది.
ఎవరిని తప్పిస్తారో?
వంగలపూడి అనిత హోంమంత్రిగా వైసీపీపై విమర్శలు చేయడంలో ముందుంటారు. అలాగే పార్టీలో ఇటు చంద్రబాబుకు, అటు లోకేశ్ నుంచి కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. గంటా శ్రీనివాసరావు కాపు సామాజికవర్గం కావడంతో మరి కాపు సామాజిక వర్గం కోటా కూడా చూడాల్సి ఉంటుంది. ఇటు విశాఖ జిల్లా పరంగానూ, అటు సామాజికవర్గం కోటాలోనూ చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల గంటా శ్రీనివాసరావు కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇటు చంద్రబాబు విశాఖ పర్యటనలోనూ, లోకేశ్ పర్యటనలోనూ ఆయన హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. విస్తరణలో గంటాకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం మాత్రం ఊపందుకోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పట్టుబట్టి సాధించాలన్నా...
మొన్నటి ఎన్నికల్లోనే గంటా శ్రీనివాసరావుకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కలేదు. చీపురుపల్లికి వెళ్లాలని కూడా నాయకత్వం సూచించింది. అయితే గంటా శ్రీనివాసరావు పట్టుబట్టి మరీ భీమిలీ సీటును తెచ్చుకున్నారు. గెలిచిన తర్వాత మాత్రం ఆయన సంతోషంగా లేరు. ఒక వైపు కాపులు ఎక్కువగా చంద్రబాబు మంత్రివర్గంలో ఉండటం, తన వియ్యంకుడు నారాయణ మంత్రిగా ఉండటంతో ఆయనకు కలసి రాలేదు. కానీ విశాఖ పరిస్థితులను బట్టి గంటా శ్రీనివాసరావుకు విస్తరణలో అవకాశం కల్పించాలని అధినాయకత్వం కూడా యోచిస్తుందని అంటున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, ఇక పోటీ చేయకుండా కుమారుడిని రాజకీయంగా ఎదిగేలా చేయాలనుకుంటున్న గంటా శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం కూడా నిర్ణయించినట్లు సమాచారం.