Summer Effect : మార్చిలోనే ముదిరిన ఎండలు.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రతరం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. హీట్ వేవ్స్ మొదలయ్యాయి. పటి వేళ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమననున్నాడు. ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ జిల్లాల్లో అత్యధికంగా...
మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా...
విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.
ఎండల నుంచి బయటపడాలంటే...
ఎండతీవ్రతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు.మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలన్నారు. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలన్నారు. ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తగినంత నీరు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలోనూ తీవత్ర పెరిగి...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువయిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలోని అనేక రాష్ట్రాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా కొన్ని జిల్లాలు, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పగటి వేళ హైదరాాద్ వంటి ప్రాంతాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పగటి వేళ బయటకు వచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు, గర్భిణులు పగటి వేళ బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.