కొత్తనేతలు సరే.. పాత నేతల సంగతేంటి?

ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా నియోజకవర్గం అభివృద్ధి మాట ఏమో కాని నేతలు మాత్రం లబ్ది పొందుతున్నారు.

Update: 2022-10-23 04:39 GMT

జంపింగ్ చేస్తున్న నేతలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తున్నారు? వారికి నేరుగా నామినేటెడ్ పదవులు ఇస్తారా? లేక వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా నియోజకవర్గం అభివృద్ధి మాట ఏమో కాని నేతలు మాత్రం లబ్ది పొందుతున్నారు. ఎన్నికలు లేకపోతే అసలు నేతలు గుర్తుకు రారు. ఎన్నికలు వచ్చాయంటే నేతలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సామాజికవర్గాల నేతలకే ఆ నియోజకవర్గం ప్రాధాన్యతను బట్టి పిలుపులు అందుతాయి.

పదవుల పందేరం...
హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఇద్దరు నేతలు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఈటల రాజేందర్ ను ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి తీసుకుని శానసమండలికి పంపారు. వీరిద్దరి వల్లా అక్కడ గెలిచింది లేదు. ఇక చాలా మందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయింది. నేతలు పోలోమంటూ వచ్చినా, వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చినా ప్రజలు మాత్రం తాము చెప్పాలనుకున్న తీర్పు చెప్పేశారు.
వచ్చిన వారికి...
ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు కూడా అంతే. బీజేపీ బూర నర్సయ్య గౌడ్ ను తీసుకుంటే... ఆయనకు పోటీగా స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్ లను పార్టీలోకి తీసుకుంది. వీరిలో ఒకరికి నామినేటెడ్ పదవి ఇస్తామని కేసీఆర్ ప్రామిస్ చేశారంటున్నారు. మరొకరు భువనగిరి ఎంపీగా బరిలోకి దిగుతారంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా ఫేమ్ లేదని భావించిన నేతలనే కేసీఆర్ ఉప ఎన్నికలు వచ్చేసరికి రెడ్ కార్పెట్ వేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త నేతలు వచ్చే సరికి పాతనేతలకు ప్రయారిటీ సహజంగానే తగ్గుతుంది.
అప్పటికే ఉన్న నేతలకు....
కర్నె ప్రభాకర్ వంటి బీసీ నేతలు పార్టీలోనే ఉన్నా ఆయనను పట్టించుకోరని, బయట ఉన్న నేతలు మాత్రమే పార్టీకి అవసరమవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉన్న బీసీ నేతలకు ఛాన్స్ లేదు కాని కొత్తగా వచ్చే వారికి అవకాశాలు ఇస్తామని హైకమాండ్ ఇస్తున్న హామీలు పాత నేతలను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ నేతల పరిస్థితి మామూలేనని అంటున్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ లబ్ది పొందేది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేనని అంటున్నారు. ఉప ఎన్నికలు నేతలకు వరంగా మారుతున్నాయనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News