"గాలి" మాటలు ఉత్తుత్తిదేనా?

వరదలు సంభవించినప్పుడు జగన్ ఏరియల్ సర్వే చేయడంతో పాటు అధికారులతో సమీక్షలు చేస్తారు తప్పించి క్షేత్రస్థాయిలో పర్యటించరు.

Update: 2022-07-25 03:48 GMT

ముఖ్యమంత్రి జగన్ యువకుడు. రాజకీయంగా సుదీర్ఘ భవిష్యత్ ఉన్న నేత. గెలుపోటములు ఎలా ఉన్నా వైసీపీ ఓడినా, గెలిచినా ఆయనే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారు. మరో మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేసే సత్తా, శక్తి ఉన్న నేత జగన్. దానికి ఎవరూ కాదనలేరు. జగన్ ముఖ్యమంత్రి అయి మూడేళ్లు అయింది. ఈ మూడేళ్లలో రెండు సార్లు భారీ వరదలు వచ్చాయి. గతంలో రాయలసీమలోని చిత్తూరు. అనంతపురం, కడప జిల్లాలు వరదలకు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రాణ, ఆస్తినష్టం కూడా జరిగింది. తాజాగా ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం భారీగానే సంభవించింది.

అందరూ భావించేది....
సహజంగా వరదలు వచ్చిన వెంటనే యువకుడైన జగన్ వెంటనే వరద బాధిత ప్రాంతాలకు పరుగులు తీస్తారని అనుకుంటారు. రాజకీయంగా మైలేజీ దక్కించుకునేందుకు ప్రయత్నంలో భాగంగా జగన్ వరద బాధత ప్రాంతాల్లో పర్యటించి హడావిడి చేసి హామీలు గుప్పించాలని వైసీపీకి చెందిన ప్రతి కార్యకర్త భావిస్తారు. జగన్ అభిమానులు కూడా అదే కోరుకుంటారు. కానీ జగన్ అందుకు పూర్తి విరుద్ధం. వరదలు సంభవించినప్పుడు జగన్ తాడేపల్లికే పరిమితమవుతారు. ఏరియల్ సర్వే చేయడంతో పాటు అధికారులతో సమీక్షలు చేస్తారు తప్పించి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇష్టపడరు.
రాయలసీమలోనూ...
గతంలో రాయలసీమలో వరదలు సంభవించినప్పుడు కూడా వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాతనే క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇప్పుడు కూడా అంతే. కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించలేదు. రేపు, ఎల్లుండి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా కరెక్టేనని చెప్పాలి. వరదలు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడకు అడుగు పెడితే అధికారులు, పార్టీ నేతలు అక్కడే ఉంటారు. బాధితుల గురించి మర్చి పోతారు. ఆ విష‍యం జగన్ కు తెలియంది కాదు. ముఖ్యంగా తాను వెళితే జిల్లా స్థాయి అధికారులే కాకుండా మండల స్థాయి అధికారులు కూడా తన పర్యటనపైనే ఎక్కువ దృష్టి పెడతారని భావించి పర్యటనకు దూరంగా ఉన్నారన్నది ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
హడావిడి ఎందుకు?
ఇందులో నిజం లేకపోలేదు. ముఖ్యమంత్రిగా హడావిడి చేయడం కంటే అక్కడ బాధితులను సకాలంలో ఆదుకోవడం, ప్రాణనష్టం జరకుండా చూడటం ముఖ్యం. పనిచేయని అధికారులపై ఇక్కడి నుంచే చర్యలు తీసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇక్కడి నుంచే అందించవచ్చు. నేరుగా బాధితులకు వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి పర్యటించిన మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. నష్టం వివరాలు అందడానికి వారం రోజులకు పైగానే సమయం పడుతంది. నష్టం వివరాలను చూసిన తర్వాత, వరద నుంచి కోలుకున్న తర్వాత వెళ్లి అక్కడకు వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వొచ్చు. వారికి సాయ పడొచ్చు. అంతే తప్ప హడావిడి చేస్తే తప్ప రాజకీయమే అవుతుంది తప్ప మరొకటి కాదన్న జగన్ ఆలోచన కరెక్టేనని పిస్తుంది. దూరదృష్టితో ఆలోచన చేస్తే జగన్ నిర్ణయం తప్పుకాదనిపిస్తుంది.


Tags:    

Similar News