ఆనం .. పయనం ఖాయమైనట్లే

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన టీడీపీలోకి వెళతారన్న టాక్ వినపడుతుంది

Update: 2022-12-28 12:12 GMT

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీల్లో అసంతృప్త నేతలు ఎవరికి వారే సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి జంప్ లు ఇక మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ పై అసంతృప్తి, అసహనం పార్టీ మారడానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. ఇక సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళతారన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వినపడుతుంది. ఆత్మకూరు సీటును ఆనం కోసం చంద్రబాబు ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టారు. మేకపాటి కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొనాలంటే ఆనం ఒక్కడే నని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా నిజమని అనిపించేలా ఉన్నాయి.

నాడు శాసించి...
ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉంటే నెల్లూరు జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ జిల్లాను శాసించే ఆనం రామనారాయణరెడ్డి 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి మారి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే జగన్ కేబినెట్ లో సీనియర్ నేతగా తనకు మంత్రి పదవి వస్తుందవి ఆనం రామనారాయణరెడ్డి ఆశించారు.

మంత్రి పదవి దక్కకుండా...
కానీ జగన్ మాత్రం కేబినెట్లో స్థానం కల్పించలేదు. రెండు దఫాలు కేబినెట్ ను విస్తరించినా ఆనం రామనారాయణరెడ్డిని పట్టించుకోలేదు. పైగా వచ్చే ఎన్నికలలో వెంకటగిరి టిక్కెట్ కూడా ఇవ్వడం కష్టమేనన్న ప్రచారం జరుగుతుంది. నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డికి ఈసారి వెంకటగిరి టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనం గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాను పార్టీ ఎమ్మెల్యేనని మరిచిపోయి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుండటం పెట్టే బేడా సర్దుకోవడానికేనన్న టాక్ నెల్లూరు జిల్లాలో బలంగా వినిపిస్తుంది.
కామెంట్స్ వైరల్...
తాజాగా కూడా ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై విమరశలు చేశారు. వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని, తాగడానికి నీళ్లు కూడా అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతామని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రాజెక్టులు కట్టామా? పింఛన్లు ఇస్తేనే ఓట్లు వేస్తారా? ఇలా అయితే పింఛన్లను గత ప్రభుత్వమూ ఇచ్చిందని, లే అవుట్ లు వేసినా ఇళ్లను మాత్రం నిర్మించలేకపోయామని ఆనం రామనారాయణరెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.


Tags:    

Similar News