Breaking : ఎమ్మెల్యే ఆనంపై వేటు?

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై హైకమాండ్ వేటు వేసే అవకాశాలున్నాయి

Update: 2023-01-03 12:32 GMT

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై హైకమాండ్ వేటు వేసే అవకాశాలున్నాయి. ఆనం వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలను కూడా వరసగా తప్పుపడుతూ చేస్తున్న వ్యాఖ్యలను ఇక సహించాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో ఆనం పై రేపో, మాపో వేటు వేస్తూ వైసీపీ నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. వెంకటగిరి ఇన్ ఛార్జిగా నేదురుమిల్లి రామకుమార్ రెడ్డిని నియమించనున్నారని తెలిసింది.

కొంతకాలంగా విమర్శలు...
ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్డుపై పడ్డ గోతులను కూడా పూడ్చలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజీ కలిగించేవిగా ఉన్నాయి. గ్రా సచివాలయాలకు భవనాలు లేవని, అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో వాటిని నడుపుతున్నారన్నారు. నిధులు మంజూరయినా నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిని ఇక ఉపేక్షించి లాభం లేదన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలిసింది.
పార్టీ డ్యామేజీ అవుతుందని...
ఎన్నికలకు ముందు పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ ప్రజల్లో పలచనవుతుందని భావిస్తుంది. ఆనంను గతంలో పిలిచి మాట్లాడినా రిపీట్ అవుతుండటంతో ఆయనకు పార్టీలో ఉండటం ఇష్టం లేదని భావించాల్సి ఉంటుందని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సీనియర్ నేతగా అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాల్సిన అంశాలను బాహాటంగా ప్రస్తావించడాన్ని జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. అయితే వేటు వేయాలన్న దానిపై ఇన్నాళ్లూ వెయిట్ చేేశారని, ఇక వింటూ ఊరుకుంటే పార్టీ మరింత డ్యామేజీ అవుతుందని భావించి ఆయనపై చర్యలకు హైకమాండ్ సిద్ధమయినట్లు తెలిసింది.
ఇన్‌ఛార్జిగా నేదురుమిల్లి...
వెంకటగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేదరుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనను వెంకటగిరి ఇన్‌చార్జిగా నియమించి ఆనంపై పార్టీ పరంగా వేటు వేయాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ చీఫ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. సీనియర్ నేత కావడంతో ఒకసారి పిలిచి ఆయనతో మాట్లాడతారా? లేక నేరుగా వేటు వేస్తారా? అన్నది రెండు రోజుల్లోనే తెలియనుంది. మొత్తం మీద ఆనంను వదిలంచుకోవడానికే జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News