తండ్రి కామెంట్స్.. తనయుడి కెరీర్ కు ప్రాబ్లమ్

వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. దీంతో వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు

Update: 2022-11-23 05:03 GMT

తండ్రి చేసిన కామెంట్స్ కు తనయుడు క్షమాపణలు చెప్పారు. వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. దీంతో వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినా ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి వర్గంలో ఒక్క కమ్మ వారికీ స్థానం కల్పించలేదని వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించడాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆయన వ్యాఖ్యలతో...
వసంత నాగేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా వైసీపీ విజయం కోసం తాను పనిచేస్తానని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.
పార్టీకి డ్యామేజీ జరిగిందని...
వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజీ జరిగిందని హైకమాండ్ భావించింది. వసంత కృష్ణ ప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చి మరీ ఎమ్మెల్యేను చేసింది ఎవరని వైసీపీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. తొలి విడతలో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చామని, రెండున్నర సంవత్సరాల తర్వాత అందరినీ తొలగించినట్లుగానే ఆయనను కూడా తొలగించామని వైసీపీ అధిష్టానం చెబుతుంది. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వారికి పదవులు ఇవ్వడం కోసం కమ్మ, వైశ్య వంటి సామాజిక వర్గాలను పక్కన పెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

జగన్ ను కలిసేందుకు...
తన తండ్రి చేసిన వ్యాఖ్యలు తన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది కలిగించేవిగా ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైకమాండ్ ను కలిసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. తన తండ్రి ఆవేశంతో మాట్లాడిన మాటలను పరిగణనలోకి తీసుకోవద్దని వైసీపీ సీనియర్ నేతలకు ఆయన సూచించినట్లు చెబుతున్నారు. ఆయన కమ్మ సామాజికవర్గం నిర్వహించిన వనభోజనం కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని భావించి, అది రాకపోవడంతోనే తన తండ్రి ఆవేశంతో ఆ వ్యాఖ్యలు చేశారని వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మైలవరంలో వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా వైసీపీ వెంటే ఉంటానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది.
Tags:    

Similar News