యోగి మీద ఇంత వ్యతిరేకత ఉందా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గరపడింది. అనుకున్నట్లుగానే యూపీలోనూ జంపింగ్ లు ప్రారంభమయ్యాయి

Update: 2022-01-13 03:03 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గరపడింది. అనుకున్నట్లుగానే అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లుగానే యూపీలోనూ జంపింగ్ లు ప్రారంభమయ్యాయి. మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లి మరీ వెళుతున్నారు ముఖ్యనేతలు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ దాస్ పై ఉన్న వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు. ఇన్నాళ్లు కడుపులో దాచిపెట్టుకున్న అసహనాన్ని ఎన్నికల వేళ కక్కి పారేస్తున్నారు.

వెళ్లిన వారంతా....
ఇప్పటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. వీరంతా బలమైన సామాజికవర్గం నేతలే. మంత్రులు దారాసింగ్ చౌహాన్, స్వామి ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేశారు. వీరిద్దరూ బీసీలో బలమైన నేతలే. యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కీలక నేతలు వెళ్లి పోవడం భాతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. వీరందరూ సమాజ్ వాదీ పార్టీలో చేరే అవకాశముంది.
సర్వేలు మాత్రం....
అయితే అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. అయితే అధికార పార్టీ కావాలని సర్వేలు చేయిస్తూ తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ధ్వజమెత్తుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలు మాత్రం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యనే జరుగుతాయి. సమాజ్ వాదీ పార్టీ కొంత పుంజుకుంది. అయితే కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ ఓట్లను భారీగా చీలిస్తే బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలున్నాయి.
యోగిని తప్పిస్తారా?
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాధ్ తో పాటు బీజేపీని మానసికంగా దెబ్బతీసేందుకు ఈ వలసలు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే బీసీల్లో ఇద్దరు బలమైన నేతలు పార్టీ నుంచి వెళ్లడంతో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. 403 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో కనీస స్థానాలను దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి యోగి ఆదిత్యనాధ్ ను తప్పించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. యోగి ప్రభుత్వం పై ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆయనను తప్పిస్తే అది తొలగిపోతుందని భావిస్తుంది.


Tags:    

Similar News