ఈ మాజీ మంత్రులిద్దరూ బకరాలేగా?

ఈరోజు శాసనమండలి రద్దు బిల్లును జగన్ ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకుంది. మండలిని కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు

Update: 2021-11-23 04:52 GMT

జగన్ గత ఏడాది శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో శాసనమండలి సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ వారిని ఎమ్మెల్సీలుగా చేసిన జగన్ తన మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఇద్దరికీ కీలక శాఖలను జగన్ అప్పగించారు. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చింది.

జగన్ ఆగ్రహానికి....
శాసనమండలిలో మూడు రాజధానులు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు వీగిపోవడంతో పెద్దల సభపై జగన్ ఆగ్రహం చెందారు. వెంటనే శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను కేబినెట్ నుంచి తప్పించారు. అయితే వారికి జగన్ అన్యాయం చేయకుండా వెంటనే రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇద్దరూ పార్టీని తొలి నుంచి నమ్ముకున్న వారే. జగన్ కు అత్యంత విశ్వాస పాత్రులు.
మండలి రద్దును వెనక్కు....
అయితే ఈరోజు శాసనమండలి రద్దు బిల్లును జగన్ ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకుంది. అంటే శాసనమండలిని కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు. కానీ తనకు నమ్మకంగా ఉన్న ఇద్దరు మంత్రులు మాత్రం పదవిని కోల్పోయారు. వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పటికీ పిల్లి, మోపిదేవిలకు అన్యాయం జరిగినట్లేనన్న చర్చ పార్టీలో జరుగుతుంది. వారికి జగన్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరం. వారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ మంత్రి పదవిని ఒక్క నిర్ణయంతో కోల్పోయినట్లయింది. ఆ నిర్ణయానికి కూడా జగన్ కట్టుబడి ఉండలేదు.


Tags:    

Similar News