లాస్ట్ ఛాన్స్ అని అనొచ్చా?

రాజకీయ నేతకు లాస్ట్ ఛాన్స్ అనేది ఉండదు. గెలిస్తే అధికారం. లేకుంటే ప్రతిపక్షం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్త కాదు.

Update: 2022-11-18 04:18 GMT

రాజకీయ నేతకు లాస్ట్ ఛాన్స్ అనేది ఉండదు. గెలిస్తే అధికారం.. లేకుంటే ప్రతిపక్షం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్త కాదు. ముఖ్యమంత్రిగా ఎంత కాలం ఉన్నారో.. దాదాపు అదే సమయం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఎప్పుడూ లేని ఈ ఎమోషనల్ డైలాగ్ ఆయన నోటి నుంచి వచ్చిందంటే సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ భేటీ జరగడం, బీజేపీ నుంచి తనకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో చంద్రబాబు ఈ డైలాగ్ ను తప్పని పరిస్థితుల్లో వదిలారంటున్నారు. రాజకీయాల్లో లాస్ట్ అనేది ఎవరికి ఉండదు. ఐదేళ్లకొకసారి ప్రజలు ఇచ్చే తీర్పుపైనే ఛాన్స్ ఆధారపడి ఉంటుంది.


ఆ పదం వర్తిస్తుందా?

అంటే చంద్రబాబు గెలిస్తే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారు. మరి అప్పుడు లాస్ట్ ఛాన్స్ ఎలా అవుతుంది. కేవలం అధికారంలోకి రావడానికి ఎమోషనల్ గా ప్రజలను తన వైపునకు తిప్పుకోవడానికే లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ను వదిలారన్నది అర్థమవుతుంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ మాటను ఊరికే అన్నారని అనుకోలేం. అనుకోవడానికి కూడా ఆయన ఆషామాషీ నేత కాదు. అన్యాపదేశంగా వచ్చిన మాట కాదు. పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ అన్న తర్వాతనే చంద్రబాబు నోటి నుంచి ఈ డైలాగు వచ్చిందంటే ఆయన వచ్చే ఎన్నికల్లో తాను వామపక్షాలతో కలసి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారనే అనుకోవాలి.
సెంటిమెంట్ పనిచేస్తుందా?
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ పనిచేస్తుందా? అంటే కాదనే చెప్పలేం. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన తర్వాత సెంటిమెంట్ తో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆయన చేతికి కట్టుతో ప్రజల ముందుకు వచ్చి సానుభూతి కోసం ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం ఆయనను ప్రజలు ఆదరించలేదు. అదే సమయంలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చేరదీశారు. అంతే తప్ప చంద్రబాబు పై హత్యాయత్నం జరగడాన్ని ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు.

ఆదరించారా... అంటే?
అలాగే జగన్ ను కూడా 2014 ఎన్నికలకు ముందు 16 నెలలు జైల్లో పెట్టినా, జగన్ పై అక్రమ కేసులు బనాయించారని జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఊరూరా తిరిగినా ప్రజలు అక్కున చేర్చుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వంగి వంగి నమాస్కారాలు పెట్టారు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాలలో తానే అభ్యర్థినని, తనను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోదీపై ధర్మ పోరాటం చేశారు. అయినా 2019 ఎన్నికల్లో మాత్రం ఎలాంటి సెంటిమెంట్ ను ప్రజలు పట్టించుకోలేదన్నది యదార్థం. ఇప్పుడు కూడా లాస్ట్ ఛాన్స్ అన్న ఎమోషనల్ సెంటిమెంట్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారన్నది ప్రశ్నగానే ఉంది. అదే ఇప్పడు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపెడుతున్న అంశంగా మారింది. అ


Tags:    

Similar News