నల్లగొండ కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుందా?

నల్లగొండ జిల్లాలో బలమైన నేతలున్నారు. ఇటు టీఆర్ఎస్ కు, అటు కాంగ్రెస్ కు బలమైన నేతలతో పాటు సాలిడ్ నియోజకవర్గాలున్నాయి.

Update: 2021-12-24 04:12 GMT

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నేతలున్నారు. ఇటు అధికార టీఆర్ఎస్ కు, ఇటు విపక్ష కాంగ్రెస్ కు బలమైన నేతలతో పాటు సాలిడ్ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల్లో ఓటమి, గెలుపులను పక్కన పెడితే ఈ జిల్లాలోని మొత్తం నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లమధ్యనే పోటీ జరుగుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్నటి వరకూ కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి నేతలు వలసరావడంతో కొంత బలహీనపడినా కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉందనే చెప్పాలి.

పన్నెండు నియోజకవర్గాల్లో....
నల్లగొండ జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలున్నాయి. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి వంటి నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో నేటికీ కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ జిల్లాలో కాంగ్రెస్ కు కూడా బలమైన నేతలున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలున్న ఈ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ జిల్లాలో బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు.
బలమైన క్యాడర్.. ఓటు బ్యాంకు....
గత ఎన్నికల్లోనూ తృటిలో కొన్ని నియోజకవర్గాలు ఓటమి పాలవ్వడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లాపై అధ్యయనం చేస్తూ అక్కడ నేతల పరిస్థితిపై సర్వే చేయిస్తున్నారని తెలిసింది. నల్లగొండ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను పక్కకు తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించాలన్న యోచన చేస్తున్నారు. అయితే ఇందుకు కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు సహకరించాల్సి ఉంటుంది. అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గా ఉండటంతో వారిపై వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుందన్న అంచనాలున్నాయి.
అందరి మధ్య సయోధ్యకు...
మొన్నటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ ముగ్గురి మధ్య సయోధ్య కుదరలేదు. అందుకే పోటీ చేయలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో పన్నెండులో కనీసం పది స్థానాలను గెలుచుకునే జిల్లా నల్లగొండ మాత్రమేనని రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నారు. అందుకే ఆ జిల్లాపై త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఈ ముగ్గురి సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదిరితే ఈ జిల్లా నుంచి ఎక్కువ స్థానాలను సాధించవచ్చన్నది రేవంత్ రెడ్డి నమ్మకం. మరి రేవంత్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాల్సి ఉంది. అయితే రేవంత్ కు వీరు సహకరించాల్సి ఉంది.


Tags:    

Similar News